కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం తొలి పాలక మండలి కొలువుదీరింది. దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా, తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. శనివారం పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత దేవస్థానానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈవో భవానీ శంకర్ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఆలయ ముఖమండపం ప్రాంగణంలో మంత్రి సురేఖ సమక్షంలో నూతన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఎం.సత్యనారాయణ రెడ్డి, పాలక మండలి సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
దేవాలయాలకు అత్యంత ప్రాధాన్యత..
ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. తొలి పాలకమండలిగా ప్రజల్లో ఉన్న అంచనాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆలయ పవిత్రత, సంప్రదాయాలను కాపాడుతూనే.. పారదర్శక పాలన, భక్తులకు మరిన్ని మెరుగైన వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీటీడీ తరహాలో ప్రమాణ స్వీకారం..
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు (పాలక మండలి) ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, నిరాడంబరంగా జరిగింది. టీటీడీ తరహాలోనే ఇక్కడి ప్రధానాలయ ముఖమండపంలోని ‘బంగారు వాకిలి’ ప్రాంగణంలో ఉదయం 11:37 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జె.భవానీ శంకర్ సమక్షంలో డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి నూతన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్వామివారిపై భక్తితో, ఆలయ సర్వతోముఖాభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉంటానన్నారు.
18 మందితో బోర్డు ఏర్పాటు..
యాదగిరిగుట్ట ఆలయానికి 18 మంది సభ్యులతో నూతన పాలక మండలి ఏర్పాటయింది. వీరిలో నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి సహా పలువురు ప్రముఖులున్నారు. బోర్డు ఛైర్మన్‌గా డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం.రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ప్రమాణం చేశారు.
ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావు, వైటీడీ ఉపాధ్యక్షులు జి.కిషన్ రావు, ఆలయ ఈవో జె.భవానీ శంకర్, ఆలయ ప్రధానార్ఛకులు కె.వెంకటాచార్యులు వ్యవహరించనున్నారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మీడియా, ఇతర వీఐపీలకు ఎలాంటి ఆహ్వానాలు పంపలేదు. అత్యంత అంతర్గతంగా, నిరాడంబరంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం.
Read Also: ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత
Follow Us On: Sharechat

