కలం, వెబ్ డెస్క్: ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్. జానకి (Singer S Janaki) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె.. గుండెపోటుకు గురై మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జానకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు 50 వేల పాటలు పాడి తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఆమె మృతితో సినీవర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆమె మనవరాలు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఈ విషయాన్ని తెలియజేశారు. జానకి 1938లో ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు కాగా తల్లి సత్యవతి గృహిణి. తండ్రి ఉపాధ్యాయ వృత్తి కారణంగా జానకి కుటుంబం కొన్నేళ్లు తెలంగాణలోని సిరిసిల్లలో నివాసం ఉన్నారు.
జానకి 1957 లో విధియన్ విలయాట్టు అనే తమిళ్ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీలో సింగర్ గా కెరీర్ ప్రారంభించారు. 2016 లో తాను పాటలు పాడటం ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ఆమె చేసిన ఈ ప్రకటన అభిమానులను ఎంతగానో బాధించింది. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి, తన గొంతుతో అందరినీ కట్టిపడేసారు జానకి. ఐదేళ్ల చిన్నారి గొంతు నుంచి 80 ఏళ్ళ వృద్ధురాలి గొంతు, మగవారి వాయిస్ కూడా మిక్స్ చేసి పాడటం ఆమెకే సాధ్యమైంది. తెలుగులో వచ్చిన గోవులు నల్లన, గోపాలు తెల్లన, చిన్నారిపొన్నారి కిట్టయ్య, సిరిమల్లె పువ్వా అని పాడిన ఇలాంటి ఎన్నో పాటలు తెలుగులో ఆమెకి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.
కరీంనగర్‌తో ప్రత్యేక బంధం
జానకి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అయినప్పటికీ ఆమెకు కరీంనగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తండ్రి శిష్ట్ల శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో పని చేశారు. జానకి తన బాల్యంలో ఎక్కువ కాలం సిరిసిల్లలోనే గడిపారు. ఈ విషయాన్ని ఆమె కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే సిరిసిల్లలో తొలిసారిగా వేదికపై పాట పాడి ఇక్కడే తన సంగీత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం దేశంలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సంగీత ప్రపంచంలో తిరుగులేని సింగర్‌గా ఎదిగారు.

