కలం, వెబ్ డెస్క్: ఏపీలోని విశాఖపట్నంకు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధాగాయత్రి (27) అనుమానాస్పద మృతి కేసులో (Radha Gayatri Death Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని గాయత్రి తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. తాజాగా మృతురాలి భర్తను అరెస్ట్ చేశారు. ముస్సోరీ (Mussoorie)కి విహారయాత్రకు వెళ్లి విషాదంగా మారిన ఈ ఘటనలో భర్త అరెస్టు కావడంతో మరిన్ని నిజాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
అసలేమైందంటే..
టెకీ రాధాగాయత్రి, ఆమె భర్త శ్రీచరణ్ కలిసి గత నెల 16న ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ముస్సోరీకి టూర్‌కు వెళ్లారు. అక్కడ వారు ఒక ప్రైవేట్ హోమ్ స్టేలో రూమ్ తీసుకొని బస చేశారు. సంతోషంగా సాగుతున్న ఆ క్షణాలు ఒక్కసారిగా విషాదంగా మారాయి. రాధాగాయత్రి ఆ హోమ్ స్టేలోనే అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసులు.. విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా పలువురి నుంచి స్టేట్ మెంట్స్ రికార్డ్ చేశారు. అయితే తన భార్య మరణంపై భర్త చెప్పిన వివరాలు పొంతన లేకుండా ఉండటం, రాధాగాయత్రి కుటుంబ సభ్యులు సైతం అనుమానాలు వ్యక్తం చేయడంతో అక్కడి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
డీఎస్పీ పర్యవేక్షణలో విచారణ..
ఈ కేసును (Radha Gayatri Death Case) తీవ్రంగా పరిగణించిన ఉత్తరాఖండ్ పోలీస్ యంత్రాంగం.. ముస్సోరీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) జేసీ పంత్ పర్యవేక్షణలో అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. హోమ్ స్టేలోని ఆధారాలు, మెడికల్ సర్టిఫికెట్స్, ప్రాథమిక విచారణలో భర్త శ్రీచరణ్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాధాగాయత్రిని ఎవరు చంపారు? అసలు మసూరీ హోమ్‌స్టేలో ఏం జరిగింది? అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే టూర్‌కు వెళ్లి యువతి చనిపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి? ఇది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం జరిగిన హత్యా? అని పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Also: ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత
Follow Us On: Instagram

