డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: మంత్రి అడ్లూరి

కలం, ధర్మపురి : యువత చదువుకునే సమయంలో మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri) విద్యార్థులకు పిలుపునిచ్చారు. నశా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం ‘మిషన్ పరివర్తన్’లో (Mission Parivartan) మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

యువతే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తమ లక్ష్యాలను సాధించాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. “ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుంది” అనే నిర్లక్ష్య ఆలోచన జీవితాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తుందని మంత్రి హెచ్చరించారు. డ్రగ్స్‌కు బానిసైన తర్వాత బయటపడటం కష్టమని, అందువల్ల ప్రారంభ దశలోనే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కళాశాలలు, విద్యాసంస్థలు లేదా పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ విక్రయం, వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులను కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.

అనుకోకుండా మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బాధితులు ఎలాంటి సంకోచం లేకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ‘నషా ముక్త్ భారత్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>