కలం, చండూరు: మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్తు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం మునుగోడులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అందుబాటులో ఉండేలా చండూరులో విద్యుత్తు శాఖ డివిజనల్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎండీకి ఫోన్ చేసి కోరారు.
క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, సేవలు అందించలేకపోతున్నారని.. వారిపై పని ఒత్తిడి ఎక్కువైందన్నారు. వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని సీఎండీకి వివరించారు.
లో వోల్టేజీ సమస్యలు పరిష్కరించాలి..
ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని, అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు.
గాలి దుమారాలు వచ్చినప్పుడు కరెంట్ తీగలు వదులు అవుతున్నాయని, వాటి వలన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే బిగతుగా మార్చే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో నల్లగొండ విద్యుత్తు ఎస్ఈ శ్రీనివాస్, డీఈలు ప్రసాద్, బాల్య నాయక్, ఏడీఈ నాగేశ్వరరావు, సాగర్ రెడ్డి, ఏఈలు పాల్గొన్నారు.

