కలం, జోగుళాంబ గద్వాల: విద్యాసంస్థలలో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం అవసరమైన కుల, ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధృవీకరణ పత్రాలు సకాలంలో అందక విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తులను కావాలనే పెండింగ్‌లో ఉంచి, పనులు త్వరగా పూర్తి చేసేందుకు కొందరు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయిస్తున్నారనే విమర్శలతో కేటిదొడ్డి మండల రెవెన్యూ కార్యాలయం (KT Doddi Revenue Office) చర్చనీయాంశంగా మారింది.
అధికారుల అలసత్వంపై విమర్శలు
ప్రజలకు పౌర సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలలో కొందరు సిబ్బంది దళారులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సిన అధికారులు ఆలస్యం చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. నేరుగా కార్యాలయానికి వెళ్లే దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదే దళారుల ద్వారా వెళ్తే పనులు త్వరగా పూర్తవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తహసీల్దార్ పర్యవేక్షణ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కేటిదొడ్డి తహసీల్దార్ కరుణాకర్‌ను వివరణ కోరగా, జీపీవోలు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బిజీగా ఉండటం వల్ల కొంత ఆలస్యం జరుగుతోందని తెలిపారు. అయినప్పటికీ విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఆమోదిస్తున్నామని పేర్కొన్నారు.

