అక్కగా ఆశీర్వదించండి, నాయకపోడ్‌లను అసెంబ్లీకి పంపిస్తాం: కవిత

​కలం, ఖమ్మం బ్యూరో: పోలీసుల ఆంక్షలు, ఫ్లెక్సీల తొలగింపుల నడుమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) ‘బాయి బాట’ పర్యటన శుక్రవారం సాగింది. గిరిజన గూడేలు, సింగరేణి గనులను సందర్శిస్తూ, ఆదివాసీల అస్థిత్వం, కార్మికుల హక్కుల కోసమే తన పోరాటమని కవిత స్పష్టం చేశారు. ​అశ్వారావుపేట మండలం కొత్తగంగారం నాయకపోడ్ గూడెంలో సంప్రదాయ స్వాగతం అందుకున్నారు. గ్రామదేవతకు పూజలు చేసి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే తాను పార్టీ పెట్టానని, నాయకపోడ్ జాతికి రాజకీయ వాటా దక్కేలా వారిని అసెంబ్లీకి పంపిస్తామని ప్రకటించారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు రూ. 2.20 లక్షల కోట్ల ఉపాధి రుణాలు, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం అనే ఐదు సూత్రాల ‘పాంచజన్యం’ ప్రణాళికతో మార్పు తెస్తామన్నారు. అక్కగా తనను ఆశీర్వదించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలని డిమాండ్ చేశారు.

​అంతకుముందు మణుగూరులో పీఆర్పీ, పే రివిజన్ కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి అధికారులకు కవిత మద్దతు తెలిపారు. పీకే ఓసీపీ-2 గని కార్మికులతో భేటీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఖాళీగా ఉన్న 3 వేల డిపెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఇందుకోసం నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని, అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు వచ్చే కార్మికుల వేతనాలు తగ్గించవద్దని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన గనులు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 54 వేల కోట్ల బకాయిల సాధన కోసం ఢిల్లీ దాకా పోరాడుతామని కవిత భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>