ఓటర్లకు అలర్ట్.. ఫారం ఇవ్వకుంటే పేరు తొలగింపు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి బూత్ లెవల్ అధికారులకు అందించాలని, లేనిపక్షంలో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడే అవకాశం ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సెక్రటరీ పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు జూలై 24 వరకు గడువు ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 21.94 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన రోజులలో ప్రక్రియను వేగవంతం చేసి రోజుకు కనీసం 6 శాతం చొప్పున పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష నిర్వహించారు. వనపర్తి (Wanaparthy) జిల్లాలో ఇప్పటివరకు 22.01 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ప్రక్రియ నెమ్మదిగా సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలా మంది ఓటర్లు తమ పేర్లు ఇప్పటికే జాబితాలో ఉన్నాయనే భావనతో ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇవ్వడం లేదని తెలిపారు.

అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాను మొదటి నుంచి పునఃపరిశీలించి కొత్త జాబితా రూపొందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. బీఎల్‌ఓలు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి తిరిగి అందించాలని ఓటర్లకు సూచించారు. ఫారాలు అందకపోతే ఓటరు జాబితాలో పేరు కొనసాగింపుపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.

ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కోసం ప్రతి బీఎల్‌ఓకు ముగ్గురు వాలంటీర్లను కేటాయిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పంచాయతీ సెక్రటరీలు, వార్డు అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రతి బీఎల్‌ఓ రోజుకు కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ (Collector Adarsh Surabhi) హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నవీన్ కుమార్, రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్. ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Read Also: పండ్లు, కూరగాయలు తాకితే కొనాల్సిందే.. ఈ వింత రూల్ ఎక్కడో తెలుసా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>