నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.. ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్య సిబ్బంది బాధ్యత అని ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో పలు పరామర్శలు, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డికి స్థానికులు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలపై ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

ఆసుపత్రిలో మొత్తం 12 మంది సిబ్బంది మంజూరై ఉండగా, వారిలో 6 మంది డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం ఒక్క వైద్యుడితోనే ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతోందని గుర్తించారు. అనంతరం జిల్లా వైద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే డిప్యూటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని వెంటనే తిరిగి విధుల్లోకి రప్పించి, ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించి, ప్రసవాల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి మూడు సార్లు అవార్డులు సాధించిందని గుర్తు చేశారు. అలాంటి ఆసుపత్రి నేడు నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని, ప్రస్తుతం అందుతున్న సేవలపై గ్రామస్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వారం రోజుల్లో మరోసారి ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శిస్తానని, అప్పటిలోపు ఆసుపత్రి నిర్వహణ, సిబ్బంది హాజరు, పరిశుభ్రత, రోగులకు అందించే వైద్య సేవల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించాలని అధికారులకు సూచించారు. దీంతో ప్రజలకు అవసరమైన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, విధుల్లో అలసత్వం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాల కిషన్ రావు, వీణవంక మండల మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, చల్లూరు సర్పంచ్ రామిడి సంపత్ రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>