కలం, వెబ్డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన, అతిగా ఆలోచించడం వల్ల చాలా మందిలో ఏకాగ్రత లోపించడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే యోగా (Yoga) తో సహజసిద్ధంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
యోగా అనేది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మెదడు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అయితే యోగాతో నిజంగా జ్ఞాపకశక్తి పెరుగుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. యోగా మెదుడులోని కణాలను ఉత్తేజపరుస్తుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రమైన ‘హిప్పోకాంపస్’ అనే భాగం చురుగ్గా పనిచేస్తుందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులు క్రమం తప్పకుండా చేయడం మంచి ఫలితం ఉంటుంది.
ఈ పద్ధతులు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల మేధోశక్తి, ఆలోచనా విధానం, ఏకాగ్రత అద్భుతంగా మెరుగుపడతాయి. క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేయడం వల్ల మెదడులో బీడీఎన్ఎఫ్ ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి కొత్త మెదడు కణాల ఉత్పత్తికి, జ్ఞాపక శక్తి పెరుగుదలకు సహాయపడుతుంది.
అందుకే ఏకాగ్రత లోపించడం, మతిమరుపు సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా యోగా చేయడం అలవాటుగా మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

