కలం, మెదక్ బ్యూరో: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ (Prashna Ravan)పై నమోదైన కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణంలోని నరేంద్ర నగర్ కాలనీలో ప్రశ్న రావణ్ నివాసం ఉంటున్నారు. గురువారం గన్నవరం పోలీసులు రావణ్ ఇంటికి వచ్చి విస్తృతంగా తనిఖీలు చేశారు.
డిజిటల్ పరికరాల స్వాధీనం..
ఆయన సోషల్ మీడియా వ్యవహారాలు, కార్యకలాపాలపై రావణ్ భార్యను ప్రశ్నించారు. డిజిటల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకునేందుకే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రావణ్‌పై ఏపీలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

