కలం, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి పాలక మండలిలో కీలక మార్పు చోటుచేసుకుంది. అసోసియేట్ సభ్యుల డైరెక్టర్ల ఎన్నికల్లో (ICC Board Elections) ఎన్నో ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఇమ్రాన్ ఖ్వాజా అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఫ్రాన్స్‌కు చెందిన గురుమూర్తి పలాని 35 ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, యూఏఈకి చెందిన ముబాషిర్ ఉస్మాని, నమీబియాకు చెందిన డాక్టర్ రూడీ వాన్ వూరెన్ చెరో 26 ఓట్లతో ఐసీసీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఖ్వాజాకు 23 ఓట్లు మాత్రమే లభించగా, మహింద వల్లిపురం 19 ఓట్లతో నిలిచారు.
ఎన్నికైన ముగ్గురు సభ్యులు రెండేళ్ల పాటు ఐసీసీ బోర్డులో కొనసాగనున్నారు. పలాని తొలిసారి బోర్డులోకి ఎన్నికవగా, ఉస్మాని తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పలాని ఎన్నికతో ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ పదవికి కొత్త ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ చైర్మన్ జై షా విజేతలకు అభినందనలు తెలిపారు. అలాగే ఇమ్రాన్ ఖ్వాజా, మహింద వల్లిపురం అసోసియేట్ క్రికెట్ అభివృద్ధికి అందించిన సేవలను ప్రశంసించారు. ఖ్వాజా నిష్క్రమణతో ఐసీసీకి కొత్త డిప్యూటీ చైర్మన్‌ను కూడా ఎంపిక చేయాల్సి ఉంది.

