కలం, నిర్మల్ : రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు మరో కొత్త ఎత్తుగడకు తెరలేపారు. తెలంగాణ వ్యవసాయ శాఖ (Telangana Agriculture Department) పేరుతో “తెలంగాణ వాతావరణ సమాచారం – EAII” అనే నకిలీ లోగో, ప్రొఫైల్ ఫొటో, క్యూఆర్ కోడ్లను ఉపయోగిస్తూ వాట్సాప్ ద్వారా రైతులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక సమాచారంలా కనిపించే ఈ సందేశాల ద్వారా రైతులను మోసం చేసే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడంతో, అదే అవకాశంగా భావించిన సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు (New Cyber Fraud) తెరలేపారు. +91 2250972990 నంబర్‌తో “EAII”పేరుతో వాట్సాప్ ఖాతా సృష్టించి, తెలంగాణ వ్యవసాయ శాఖ లోగోను దుర్వినియోగం చేస్తున్నారు. “వాతావరణ సమాచారం”, “వ్యవసాయ సలహాలు”, “వర్ష సూచనలు” పేర్లతో రైతులను గ్రూపులలో చేర్చేందుకు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ శాఖ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలు సృష్టించి, క్యూఆర్ కోడ్లు లేదా లింక్‌లు పంపిస్తూ ఛానల్లో చేరాలని కోరడం ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తులు పంపిన లింకులు, క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయకూడదని, ప్రభుత్వ సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లు, జిల్లా వ్యవసాయ అధికారులు లేదా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలుసుకోవాలని సూచించారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వాట్సాప్ ఖాతాలు లేదా ఛానళ్లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని, ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రతి రైతు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

