కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఎంపీ, ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంచుతున్న ప్రభుత్వాలకు సేవ చేస్తున్న ప్రభుత్వాస్పత్రుల కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచడానికి బడ్జెట్ ఉండదా? అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో రోజు ఆందోళనలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలో కార్మికులు అర్ధనగ్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వేతనాలు పెంచకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ ఆధునిక వైద్యం సంకల్పానికి ఆసుపత్రి కార్మికులు పునాది రాళ్లుగా సేవలందిస్తున్నారని ఇలాంటి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రాష్ట్ర ఆదాయ గణాంకాలు పరిగణనలోకి తీసుకోకుండా శ్రమకు తగిన ఫలితం అందే విధంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కొన్ని ఆసుపత్రులలో నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని పి.సురేశ్ అన్నారు.
ప్రభుత్వ ఆదేశాలు జీవోలు కార్మిక చట్టాలు కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ చట్టాలు దోపిడీ ఏజెన్సీ కాంట్రాక్టర్లకు చుట్టాలుగా మారుతున్నాయని పి.సురేశ్ అన్నారు. కాల పరిమిత ముగిసిన ఏజెన్సీలను తక్షణమే రద్దుచేసి కనీస వేతనం రూ.26 వేలకు పెంచుతూ నూతన టెండర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత రెండు రోజులుగా ఆసుపత్రుల ఎదుట కార్మికులు నిరసనలు చేపడుతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని కారణంగా రేపు (గురువారం) హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలను వందలాది మందితో ముట్టడిస్తున్నట్లు సురేశ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనియన్ బ్రాంచ్ నేతలు, కార్మికులు రంగన్న, యస్. దేవానంద్, బి.చెన్నయ్య, భీమయ్య, శ్రీనివాసరెడ్డి, అంజలయ్య, జే.నరసింహ, జగ్గ నాయక్, నరసింహ, వెంకటయ్య, ఆంజనేయులు, యాదయ్య, నైసన్, మన్యం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాం: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

