కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ, డీఆర్డీఓ, జిల్లా పంచాయతీ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గుడిసెలలో నివసిస్తున్న అర్హులైన పేదలకు రెండో దశలో ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా మంజూరు చేయాలని సూచించారు. మండలాల వారీగా గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించిన ఆయన, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించి ఇళ్ల నిర్మాణం నిలిచిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన కలెక్టర్ (Collector Bhavesh Mishra).. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణ చేపట్టాలని, చెత్తను శాస్త్రీయంగా నిర్వహించి సేంద్రియ ఎరువుల తయారీతో పాటు ఇతర ఆదాయ వనరులను అభివృద్ధి చేయాలని చెప్పారు. గ్రామాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు స్టీల్ బ్యాంకుల వినియోగాన్ని ప్రోత్సహించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై ప్రజలు, వ్యాపారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి వారం రెండు రోజుల పాటు డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలని తెలిపారు. త్రాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరిచి క్లోరినేషన్ నిర్వహించాలని, ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని, ఫామ్ పాండ్ల నిర్మాణ లక్ష్యాలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: అర్జెంటీనా సంచలన విజయం.. కోచ్ స్కలోని ఎమోషనల్
Follow Us On: Instagram

