కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బుధవారం “పోలీస్ మీ కోసం” అవగాహన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ (CCTV) కెమెరాలను పోలీసు ఉన్నతాధికారులు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం (Karimnagar CP Gaush Alam) మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
వెలిచాల గ్రామంలో పాత కెమెరాల స్థానంలో నలభై అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త సీసీటీవీ కెమెరాలను అమర్చడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామం, పట్టణం, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూల సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో లోపాలను అధిగమిస్తూ మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
సైబర్ నేరాలు, ఆన్ లైన్ గేమ్స్‌పై అవగాహన
ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల (Cyber Crimes) పట్ల, వాటి వల్ల జరిగే నష్టాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ (Karimnagar CP) కోరారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్‌లైన్ గేమింగ్ (Gaming Addictions) బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడటం లేదా డబ్బులు నష్టపోవడం వంటి ఘటనలు కరీంనగర్ జిల్లాలో కూడా వెలుగు చూస్తున్నాయని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాల నిర్మూలన
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల అలవాట్లకు దూరంగా ఉండాలని సీపీ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. వాహనదారులు, ప్రయాణికులు మరియు బాటసారుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సదస్సు ద్వారా వివరించారు.
రహవీర్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడితే ప్రభుత్వం అందించే 25 వేల రూపాయల పథకాన్ని గూర్చి అవగాహనా కలిపించారు. ఈ అవగాహన కార్యక్రమం, సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగ రావు, గ్రామ ప్రజాప్రతినిధులకు, ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, యాంటీ నార్కోటిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ రఫీక్, రామడుగు ఎస్సై రాజు, స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగ రావు, స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Read Also: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?
Follow Us On : WhatsApp

