Mobile Popup Ad
Mobile Popup Ad

ఈ పర్యటన ఉన్నత విద్యకు కొత్త దిశ: ఎంజీయూ వీసీ

కలం, నల్లగొండ: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన 35 మంది ప్రతినిధుల బృందం జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో చేపట్టిన విద్యా అధ్యయన పర్యటన విజయవంతంగా ముగిసిందని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (MGU Vice Chancellor) తెలిపారు. జూన్ 28 నుంచి జూలై 6 వరకు జరిగిన ఈ అంతర్జాతీయ పర్యటన తెలంగాణ ఉన్నత విద్యా రంగానికి సరికొత్త దిశను చూపించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యటన ముగించుకుని విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఉపకులపతికి వర్సిటీ అధ్యాపక బృందం ఘనంగా అభినందనలు తెలిపింది.

ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ఖ్యాతి గల విశ్వవిద్యాలయాలైన యూనివర్సిటీ ఆఫ్ గోట్టింగెన్, మ్యూనిక్, యూనివర్సిటీ ఆఫ్ ఆఖెన్, ఓస్ట్ఫాలియా యూనివర్సిటీలతో పాటు ‘మెర్సిడెస్–బెంజ్ సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్’ను సందర్శించినట్లు వీసీ (MGU Vice Chancellor) తెలిపారు. అక్కడ అమలవుతున్న ఉన్నత విద్య, వినూత్న బోధన పద్ధతులు, పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, పరిశ్రమ–విద్యా రంగాల భాగస్వామ్యం వంటి కీలక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పేర్కొన్నారు.

ఆయా అంతర్జాతీయ వర్సిటీల ప్రొఫెసర్లు, నిర్వాహకులతో జరిపిన చర్చల ద్వారా విద్యార్థి కేంద్రిత బోధన విధానాలు, అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ, స్కిల్ డెవలప్‌మెంట్, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అంశాలపై ప్రత్యక్ష అనుభవం లభించిందని వీసీ వివరించారు. భవిష్యత్తులో విద్యార్థి-బోధకుల ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్ లెక్చర్లు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లు, సంయుక్త పరిశోధనల రూపకల్పనకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందన్నారు.

‘తక్కువ వనరులతోనే నాణ్యమైన విద్యను అందించడం, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత బోధన, సమాజంతో విద్యాసంస్థల అనుసంధానం వంటి అంశాలలో ఈ పర్యటన స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఈ నమూనాలు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయి.’ అని ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీదేవి, డాక్టర్ వై. ప్రశాంతి, మారం వెంకట రమణారెడ్డి, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: కదిలే రైలులో హనీమూన్.. నెట్టింట వీడియో వైరల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>