Mobile Popup Ad
Mobile Popup Ad

పొట్టుపొట్టు కొట్టుకుండ్రూ.. తుంగతుర్తిలో తీవ్ర ఉద్రిక్తత!

కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ (Thungathurthi Congress) పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. నియోజకవర్గ పరిధిలోని అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు రోడ్డుపైకి వచ్చి పరస్పరం ‘పొట్టుపొట్టు’ కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు దాడులు చేసుకోవడమే కాకుండా, పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసుల వాహనాలను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

ఇటీవల పీసీసీ ప్రకటించిన తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ (Thungathurthi Congress) మండల అధ్యక్షుల నియామకాలు ఈ తీవ్ర వివాదానికి, ఘర్షణకు దారితీశాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్ (Mandula Samuel) ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తనతో పాటు వలస వచ్చిన వారికే కీలక పదవులు కట్టబెట్టారని పాత కాంగ్రెస్ (ఒరిజినల్ కాంగ్రెస్) క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసి, కేసులు ఎదుర్కొన్న సీనియర్లను కాదని, కనీస ప్రాథమిక సభ్యత్వం లేని వలస నేతలకు 9 మండలాల్లో 7 మండలాల అధ్యక్ష పదవులు ఇవ్వడంపై పాత క్యాడర్ తిరుగుబాటు బావుటా ఎగురవేసింది.

ఛలో గాంధీభవన్‌ను అడ్డుకోవడంతో రచ్చ..

మండల అధ్యక్షుల నియామకాలను నిరసిస్తూ, ఆ నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలోని అసంతృప్త (పాత కాంగ్రెస్) నాయకులు, కార్యకర్తలు ఛలో గాంధీభవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వారు వాహనాల్లో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు బయలుదేరారు. అయితే, వారి వాహనాలు అర్వపల్లి చౌరస్తాకు చేరుకోగానే ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు వారిని ముందస్తు ప్రణాళికతో అడ్డుకున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య మాటకు మాట పెరిగి, అది కాస్తా భౌతిక దాడులకు దారితీసింది. రోడ్డుపైనే ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో బాహాబాహీకి దిగడంతో అర్వపల్లి చౌరస్తా రణరంగంగా మారింది. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గానికి మధ్య ఉన్న పాత ఆధిపత్య పోరు కూడా ఈ ఘర్షణతో బహిర్గతమైంది.

పోలీసుల లాఠీఛార్జ్ – వాహనాల ధ్వంసం..

ఘటన సమాచారం అందుకున్న అర్వపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్యకర్తలు వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. ఈ ఉద్రేక వాతావరణంలో కొందరు ఆందోళనకారులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వడంతో, పోలీసు జీపుల అద్దాలు పగిలి వాహనాలు ధ్వంసమయ్యాయి.

ప్రస్తుతం అర్వపల్లి చౌరస్తా, మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్తులను, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని ఉన్నత పోలీస్ అధికారులు తెలిపారు. మరోవైపు, తుంగతుర్తి నియోజకవర్గంలో పాత వర్సెస్ కొత్త నేతల మధ్య రాజుకున్న ఈ వర్గపోరును కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: కాంగ్రెస్‌ది నేరపూరిత నిర్లక్ష్యం .. హరీశ్ రావు ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>