కలం, వెబ్ డెస్క్ : హనుమకొండకు (Hanumakonda) చెందిన తన వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో అతని ఇంటికి వెళ్లి కలిసిన క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి, నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన చిరునవ్వు ఎప్పటికీ మరువలేనిది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వ్యాధితో పోరాడుతున్నప్పటికీ నిరంజన్ చూపించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. “అతని శరీరం వ్యాధితో పోరాడినా, మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితంపై అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరంజన్ (Niranjan) కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని వారికి భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. చివరగా, “ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ చిన్నారికి హృదయపూర్వకంగా నివాళులర్పించారు.
Read Also: మత్స్యకారుల ఆశలు గల్లంతు.. ముగిసిన సెర్చ్ ఆపరేషన్
Follow Us On : WhatsApp

