కలం, స్పోర్ట్స్: ది హండ్రెడ్ 2026 కొత్త సీజన్ కోసం సదరన్ బ్రేవ్ (Southern Brave) ఫ్రాంచైజీ తమ కొత్త కెప్టెన్లను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది. జీఎమ్ఆర్ గ్రూప్‌నకు భాగస్వామ్యం ఉన్న ఈ ఫ్రాంచైజీ, మహిళల జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన సోఫీ మోలినెక్స్ను, పురుషుల జట్టు కెప్టెన్‌గా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్‌ను నియమించింది. ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుకు 2026 మహిళల టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందించిన 28 ఏళ్ల సోఫీ మోలినెక్స్, ఈ జట్టుకు సరైన ఎంపికగా నిలిచింది. వేలంలో 47,500 పౌండ్లకు అమ్ముడైన ఆమె, ఈ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచింది.
సదరన్ బ్రేవ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్టుకు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఈ వేసవిలో జట్టుతో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఉన్నానని సోఫీ మోలినెక్స్ సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు, పురుషుల జట్టులో జేమ్స్ విన్స్ స్థానంలో 37 ఏళ్ల క్రిస్ జోర్డాన్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు. ఈ టోర్నీ ప్రారంభం నుండి సదరన్ బ్రేవ్ జట్టుకే ఆడుతున్న జోర్డాన్‌ను 1,60,000 పౌండ్లకు ఫ్రాంచైజీ అంటిపెట్టుకుంది.
ఇప్పటివరకు ఈ జట్టు తరఫున 33 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు తీసి, 258 పరుగులు చేసిన జోర్డాన్, తన విధేయతకు దక్కిన బహుమతిగా ఈ కెప్టెన్సీని భావిస్తున్నాడు. మొదటి రోజు నుండి సదరన్ బ్రేవ్ తన సొంత ఇల్లు లాంటిదని, ఈ సీజన్లో జట్టును విజయపథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని జోర్డాన్ తెలిపాడు.

