కలం మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో ‘బెస్ట్ అవైలబుల్ స్కీమ్’ (Best Available Scheme) పథకం అమలుపై ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చుకోవడం లేదంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో కలెక్టరేట్ నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh) వాహనాన్ని బాధితులు గేటు వద్దే అడ్డుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోవడంతో కలెక్టరేట్ పరిసరాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అయితే ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (Best Available Scheme) సమస్యపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉదయమే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ యాజమాన్యాలు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లగక్కాయి. ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాని, పాత బిల్లులే ఇంకా క్లియర్ కాలేదన్నారు.
‘ఇప్పుడు కొత్తగా విద్యార్థులను చేర్చుకుంటే వారికి భోజన, వసతి సౌకర్యాలు ఎలా కల్పించాలి? అంత ఆర్థిక భారం మేం మోయలేం’ అని యాజమాన్యాలు కలెక్టర్‌కు స్పష్టం చేశాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదలయ్యేలా చూడాలని, అప్పుడే తాము విద్యార్థులను చేర్చుకోగలమని వేడుకున్నారు. ఒకవైపు స్కూల్ అడ్మిషన్ల గడువు ముగుస్తుండటం, మరోవైపు యాజమాన్యాలు మొండికేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Read Also: డ్రగ్స్ స్మగర్ల ఆస్తులు జప్తు: డీజీపీ సీవీ ఆనంద్
Follow Us On: X(Twitter)

