కలం, జోగుళాంబ గద్వాల: “గద్వాల (Gadwal) పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.. ఇస్తాంబుల్ చేస్తాం.. అంటూ కాగితాలపై రంగుల కలలు పండించే అధికారులు, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని భీంనగర్ ప్రధాన రహదారిపై అభివృద్ధి పేరిట రోడ్లను తోవ్వి, సగం పనులకే మంగళం పాడటంపై స్థానిక వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూపించిన సుందరీకరణ ఆశలకు ఇప్పుడు “గుండు సున్నా” మిగిల్చి, రోడ్లను గెలికి అస్తవ్యస్తంగా వదిలేయడంపై “అసలు ఏం సాధించారని పనులు ఆపేశారు?” అంటూ మున్సిపల్ యంత్రాంగాన్ని ప్రజలు సూటిగా, ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
నాడు ఆర్భాటాల హర్షం.. నేడు అక్రమణల నరకం!
భీంనగర్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను రూపుమాపుతామంటూ ఎన్‌క్రోచ్‌మెంట్ (ఆక్రమణల) తొలగింపు పేరిట అధికారులు పెద్ద ఎత్తున బుల్డోజర్లతో హడావుడి చేశారు. రోడ్ల పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేసి రోడ్డును విశాలం చేస్తుంటే, గద్వాల పట్టణ ప్రజలంతా ఎంతో హర్షించారు. పట్టణం మొత్తం ఇలాగే మారుతుందని ఆశపడ్డారు. కానీ, అధికారుల ఉత్సాహం కేవలం కూల్చడానికే పరిమితమైంది. ఆక్రమణలు తొవ్వి రోజులు గడుస్తున్నా, వాటిని అలాగే గాలికి వదిలేయడంతో నాడు హర్షించిన ప్రజలే నేడు అధికారుల నిర్లక్ష్యానికి నరకం అనుభవిస్తున్నారు.
కుప్పలుగా మట్టి, రాళ్లు.. కుదేలవుతున్న వ్యాపారాలు!
కూల్చివేతలు జరిగి రోజులు గడుస్తున్నా.. షాపుల ముందు పేరుకుపోయిన మట్టి, రాళ్ల కుప్పలను తొలగించడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. షాపుల ముందే కొండల్లా మట్టి కుప్పలు ఉండటంతో కస్టమర్లు రావడానికి భయపడుతున్నారు. అటు మున్సిపల్ అధికారులు పట్టించుకోరు, ఇటు బిల్డింగ్ ఓనర్లు కొత్త నిర్మాణాలకు ముందుకు రారు.. మధ్యలో షాపులు నడుపుకునే నిర్వాహకులు వ్యాపారాలు సాగక, అద్దెలు కట్టలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులకు కనీసం చలనం లేకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
వర్షం వస్తే కుంటలే.. వాహనదారులకు నిత్య గండం!
ప్రస్తుతం వానకాలం ముంచుకొచ్చింది. తవ్వి వదిలేసిన గుంతలన్నీ ఇప్పుడు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. ఏ క్షణాన ఏ గుంతలో ఏ వాహనం మునిగిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. రోడ్డు సవ్యంగా లేకపోవడంతో వాహనాలన్నీ రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది, ఫలితంగా భీంనగర్ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. నిత్యం వాహనదారులు, పాదచారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది.
ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు ఏసీ రూముల నుంచి బయటకి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వానకాలం తీవ్రమవ్వక ముందే, యుద్ధప్రాతిపదికన ఆ మట్టి, రాళ్ల కుప్పలను తొలగించి, రోడ్డు పనులను పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.

