Mobile Popup Ad
Mobile Popup Ad

అమ్రాబాద్ పునరావాసంపై కలెక్టర్ సమీక్ష

కలం, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ (Amrabad) టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల స్వచ్ఛంద పునరావాసం కోసం.. పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను జిల్లా కలెక్టర్ (Nagarkurnool Collector) హేమంత్ కేశవ్ పాటిల్(Hemanta Keshav Patil) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల పెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందిన ఫేజ్–1 (ఆప్షన్–2) లబ్ధిదారుల కోసం రూపొందిస్తున్న కాలనీ లేఅవుట్‌ను పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలను నాణ్యతతో కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి లబ్ధిదారునికి గృహ స్థలాలు, విశాలమైన రహదారులు, తాగునీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, కమ్యూనిటీ హాల్, గ్రామ పరిపాలనా కార్యాలయం, రేషన్ దుకాణం, పార్కు, ఆట స్థలం వంటి సామాజిక మౌలిక వసతులను సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేయాలని తెలిపారు. అటవీ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పునరావాసాన్ని ఎంచుకున్న నేపథ్యంలో, వారికి విద్య, వైద్యం, త్రాగునీరు, విద్యుత్, రవాణా, ఉపాధి అవకాశాలు వంటి అన్ని ప్రాథమిక సేవలు అందుబాటులో ఉండేలా ఆదర్శవంతమైన కాలనీని నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పునరావాస కాలనీ అభివృద్ధిలో అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు–భవనాల శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూనే లబ్ధిదారుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా అధికారులు కాలనీ లేఅవుట్, ప్లాట్ల విభజన, రహదారులు, త్రాగునీటి వనరులు, విద్యుత్ కనెక్షన్‌లు, ప్రజా వినియోగ స్థలాల కేటాయింపు తదితర అంశాలను కలెక్టర్‌కు వివరించారు. అవసరమైన మార్పులు చేసి కాలనీని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. ఈ పర్యటనలో కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రతో పాటు అటవీ, రెవెన్యూ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>