Mobile Popup Ad
Mobile Popup Ad

15 కిలోమీటర్లు ఈది ప్రాణాలతో బయటపడ్డా: మత్స్యకారుడు చిన్నా!

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం (Visakhapatnam) సముద్రంలో బోటు బోల్తా పడి, మృత్యువు నోట్లోకి వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చిన మత్స్యకారుడు కారె చిన్నా ఆ రాత్రి జరిగిన ఘోరాన్ని వివరించాడు. తన కళ్లముందే కుటుంబ సభ్యులు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేకపోయానని, సకాలంలో సాయం అంది ఉంటే వారంతా బతికేవారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ భయానక ఘటన వివరాలు చిన్నా మాటల్లోనే..

‘మేమంతా ఎప్పటిలాగే హార్బర్ నుండి వేటకు వెళ్లాం. నడిసంద్రంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా భారీ అల రూపంలో పెను ప్రమాదం మాపై వచ్చి పడింది. రాకాసి అలల ఉధృతికి బోటు తిరగబడింది. ఆ బోటు బోల్తా పడిన క్షణంలోనే మొదట మా అన్నయ్య కొడుకు చిన్నయ్య నీటిలో మునిగిపోయి మాకు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత నా కళ్లముందే నా అన్న, తమ్ముడు సహా మిగిలిన వారు కూడా అలల తాకిడికి కొట్టుకుపోయారు. నా కళ్లముందే నా కుటుంబం మొత్తం కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండిపోయాను తప్ప ఏమీ చేయలేకపోయాను.

ప్రమాదం జరిగిన తర్వాత రాత్రి 9 గంటల వరకు ఎలాగోలా బోటు పైనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నాం. చైనా షిప్ వైపు వెళ్లే క్రమంలో మిగతా నలుగురు కూడా అలల తాకిడికి కొట్టుకుపోయారు. ఇక అక్కడ ఉంటే లాభం లేదనుకుని నేను ఒక్కడినే సముద్రంలో ఈదడం ప్రారంభించాను. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7:30 గంటల వరకు.. దాదాపు 15 కిలోమీటర్లు మృత్యువుతో పోరాడుతూ, ఈదుకుంటూ చైనా షిప్ వద్దకు చేరుకున్నాను. అక్కడ నుండి ప్రాణాలతో ఒడ్డుకు చేరాను. మేము గల్లంతైన ప్రాంతానికి ఒక్క బోటు కానీ, హెలికాప్టర్ కానీ సమయానికి వచ్చి ఉంటే నా వాళ్లంతా బ్రతికేవారు. కానీ ఏ బోటూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు’ అంటూ చిన్నా కన్నీరుమున్నీరయ్యాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>