కలం, జోగులాంబ గద్వాల : గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలు, బేకరీలలో కాలం చెల్లిన (Expired Food Items) ఆహార పదార్థాలు, వస్తువుల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారుల నిఘా కొరవడటం, గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేకపోవడంతో కొందరు వ్యాపారులు అమాయక ప్రజల, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
తాజాగా కేటిదొడ్డి (KT doddi) మండలం గంగన్పల్లి గ్రామంలోని ఒక కిరాణా దుకాణంలో కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తుండగా ఓ వినియోగదారుడు గమనించి నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ దుకాణంలో నిత్యం పాఠశాల విద్యార్థులు వివిధ కంపెనీల మసాలా రింగ్స్, చిప్స్, బిస్కెట్లు వంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తింటున్నారు. గడువు ముగిసిన ఇలాంటి పదార్థాలను తినడం వల్ల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో ఇంత బహిరంగంగా కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నా.. అటు రెవెన్యూ అధికారులు, ఇటు పంచాయతీ కార్యదర్శులు గానీ, పోలీస్ అధికారులు గానీ కనీసం తనిఖీలు చేసిన పాపాన పోలేదని మండల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఉన్నతాధికారులు స్పందించి, గ్రామాల్లోని కిరాణ దుకాణాలు, బేకరీ దుకాణాలలో తక్షణమే తనిఖీలు చేపట్టి కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also: డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్
Follow Us On: Instagram

