కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal)లో నాసిరకం విత్తనాలు కలకలం రేపుతున్నాయి. విత్తనాలను కొనుగోలు చేసి విత్తుకున్న రైతులు అవి మొలకెత్తడం లేదంటూ ఆందోళనకు దిగారు. భైంసా మండలం మాటేగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ రైతులు మొలకెత్తని సోయా విత్తనాల సమస్యపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మార్కెట్‌లో కొనుగోలు చేసిన తేజస్వీ కంపెనీ సోయా విత్తనాలను సాగు చేసామన్నారు. విత్తనాలు నాటి పది రోజులు గడిచినా 20 శాతం కూడా మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా నష్టపరిహారం ఇవ్వకుండా మరోసారి విత్తుకోవడానికి కొత్త విత్తనాల బ్యాగులు ఇస్తామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. నాసిరకం విత్తనాలను మార్కెట్లోకి ఎలా విడుదల చేశారో అధికారులు విచారణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. పంట కాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించడంతో పాటు సంబంధిత విత్తన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి తమకు న్యాయం చేయాలని కోరారు.

