Mobile Popup Ad
Mobile Popup Ad

రెవెన్యూ ఫైళ్ల పెండింగ్‌పై మంత్రి జూపల్లి ఫైర్‌!

కలం, నాగర్ కర్నూల్: “ప్రజలు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అధికారులు ఫైళ్లను పెండింగ్‌లో పెడితే ఎలా? ఒక టేబుల్‌ నుంచి మరో టేబుల్‌కు ఫైళ్లను పంపించడం పరిపాలన కాదు. ప్రజల సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపడమే పరిపాలన” అని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అనవసరంగా ఫైళ్లను పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. కొల్లాపూర్‌ (Kollapur) నియోజకవర్గంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్డీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఒరిజినల్‌ ఫైళ్లు, నోట్‌ ఫైళ్లు, సంబంధిత రికార్డులను తెప్పించి ఒక్కో అంశాన్ని స్వయంగా పరిశీలించారు. ఫైళ్లు ఏ దశలో ఉన్నాయి? ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఎవరి వద్ద ఆగిపోయాయి? పరిష్కారానికి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చినా అనేక అంశాలు ఇప్పటికీ అదే దశలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఒక ఫైల్‌ మీ వద్దకు వస్తే మరో అధికారికి పంపించి చేతులు దులుపుకోవడం కాదు. క్షుణ్ణంగా పరిశీలించి చట్టబద్ధమైన పరిష్కారం చూపాలి అని స్పష్టం చేశారు.

16 అంశాలపై మంత్రి స‌మీక్ష‌

ముక్కిడిగుండం, సోమశిల, రామాపురం, ఎల్లూరు, జటప్రోలు, గోపాలపురం శివారు, సింగోటం, కొల్లాపూర్‌, చింతలపల్లి, సోమశిల రోడ్డు, చౌటబెట్ల శివారుకు సంబంధించిన పోడు పట్టాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, రెవెన్యూ–అటవీ భూ వివాదాలు, జాయింట్‌ సర్వేలు, పట్టాదారు హక్కులు, లావోని పట్టాలు, భూ రికార్డుల సవరణ, ఫోడి సర్వే, పీఓటీ రెగ్యులరైజేషన్‌, భూభారతి, వ్యవసాయ మార్కెట్‌ యార్డు, హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 16 అంశాలపై మంత్రి (Jupally Krishna Rao) సమీక్షించారు.

అర్జీదారులను పిలిపించి.. అక్కడే నిర్ణయం..

ప్రతి అంశానికి సంబంధించిన అర్జీదారులను పిలిపించి, గ్రామ పాలన అధికారి (జీపీఓ) నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, సర్వే అధికారులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది వరకు సంబంధిత అధికారులందరూ ఒకేచోట కూర్చొని సమస్యలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ఎవరి స్థాయిలో ఏ నివేదిక ఇవ్వాలి? ఎవరు ఏ చర్య తీసుకోవాలి? అనే విషయాలను అక్కడికక్కడే నిర్ణయించి రికార్డు చేయాలని సూచించారు.

డివిజన్‌ స్థాయిలో పరిష్కరించగల ఒక్క ఫైల్‌ కూడా పెండింగ్‌లో ఉండకూడద‌న్నారు. నివేదికలను నమోదు చేసి ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి. కలెక్టర్‌ స్థాయిలో నిర్ణయం అవసరమైన అంశాలకు పూర్తి ప్రతిపాదనలు, రికార్డులతో ఈరోజే పంపాల‌ని సూచించారు. అనవసరంగా ఫైళ్లను పెండింగ్‌లో ఉంచితే సహించేది లేద‌ని హెచ్చరించారు. ప్రతి ఫైల్‌ ఏ దశలో ఉంది? ఎందుకు పెండింగ్‌లో ఉంది? ఏ అధికారి వద్ద ఉంది? తదుపరి ఎవరు ఏ చర్య తీసుకోవాలి? ఎంత గడువులో పరిష్కరించాలి? అనే వివరాలతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

క్యాంపు కార్యాలయం నుంచి వచ్చే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని మంత్రి సూచించారు. క్షుణ్ణంగా విచారణ జరిపేందుకు కొంత సమయం తీసుకున్నా అభ్యంతరం లేదని, ఫైళ్లను మాత్రం అనవసరంగా పెండింగ్‌లో ఉంచొద్దని స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ అదే సమస్యతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా దీర్ఘకాలిక సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సమీక్షలో రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also: గులాబీ తోటలో బావబామ్మర్దుల పొలిటికల్ ఫైట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>