Mobile Popup Ad
Mobile Popup Ad

సొంత భూముల్లోనే పరాయోళ్లం.. ఏజెన్సీ దళితుల కన్నీటి గాథ

కలం, ఖమ్మం బ్యూరో: ఏజెన్సీ ప్రాంతాల్లో దళిత రైతుల (Dalit Farmers) గోడు ఏండ్లుగా అరణ్యరోదనగానే మిగిలిపోతున్నది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న సొంత భూముల్లోనే నేడు పరాయోళ్లలా బతకాల్సి వస్తున్నది. భూమి ఉన్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో చట్టపరమైన హక్కులు లభించక, బ్యాంకులు రుణాలు ఇవ్వక దళిత రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 75 శాతానికి పైగా దళితులకు తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములు చేతిలో ఉన్నప్పటికీ.. పట్టాలు లేకపోవడంతో ఆ భూమిపై ఎలాంటి రుణాలు పొందలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా వ్యవసాయ పెట్టుబడులకు నిధులు సమకూర్చుకోలేక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దళితులపై దయ చూపరా..?

ఏజెన్సీ భూములు సాగు చేసుకుంటున్న దళితులను ప్రస్తుత చట్టాలు “వలస వచ్చిన వారు”గా పరిగణిస్తూ పరాయోళ్లలా చూడటం ఎంతవరకు న్యాయమని బాధిత దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు తమను గుర్తిస్తున్నారని, హామీలు ఇచ్చి ఓట్లు పొందిన తర్వాత అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు బ్యాంకు దృష్టికోణాన్ని పక్కనపెట్టి ఏజెన్సీ దళితులపై దయ చూపాలని వారు కోరుతున్నారు. గిరిజనులతో పాటు తమకూ భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, పోడు పట్టాల పంపిణీలో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి ప్రకటనతో మళ్లీ ఆశలు

ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న నాన్-ట్రైబ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకురావాలనే ఆలోచనలో ఉందని వెల్లడించారు. రాబోయే రెండున్నరేళ్లలో కేబినెట్ ఆమోదంతో మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే నాన్-ట్రైబ్స్‌కు, ముఖ్యంగా దళితులకు భూ హక్కుల విషయంలో ఉపశమనం కలిగేలా ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

చరిత్ర ఏం చెబుతుందంటే..?

బ్రిటిష్ కాలం, అలాగే నిజాం పాలన సమయంలో దళితులకు “మాల మాన్యాలు”, “మాదిగ మాన్యాలు” పేరుతో భూములు కేటాయించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆ కాలంలో జీవనోపాధి కోసం భూమి హక్కులు ఇచ్చిన వ్యవస్థ అమలులో ఉండేదని, గ్రామస్థాయి రికార్డుల్లో కూడా వాటి ప్రస్తావనలు ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అలాగే 1959 నాటి ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు భూమి పట్టాలు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కానీ, పాలకుల చారిత్రక తప్పిదాలతో ఏజెన్సీ చట్టాల పరిధిలోకి దళితులు రాకుండా పోయి, సొంత భూముల్లోని హక్కుల్లేని అభాగ్యులుగా మిగిలిపోయారని చెప్తున్నారు.

తరతరాలుగా బతుకుతున్నాం..

తరతరాలుగా ఏజెన్సీలో బతుకుతున్నాం. ఆదివాసీలతోనే మమేకమై కలిసి మెలసి ఉంటున్నాం. ఏనాడు ఘర్షణలు పడలేదు. అయినప్పటికీ ప్రభుత్వాలు మాకు భూములపై హక్కులు కల్పించకుండా వివక్ష చూపిస్తున్నాయి. ఇప్పటికైనా చట్టాలను సడలించి మాకు హక్కులు కల్పించాలని భద్రాద్రి జిల్లా మణుగూరు రైతు దామల్ల వెంకటయ్య అంటున్నారు.

పొలం అమ్ముకునే హక్కూ లేదు..

పొలం కొనుగోలు చేసే హక్కు లేదు.. ఉన్న పొలం అమ్ముకునే హక్కూ లేదు. అప్పు కోసం భూమిని తాకట్టు పెట్టాలన్నా పట్టా బుక్లు అడుగుతున్నారు. మాకు పట్టాలు ఇవ్వాలని అధికారులను అడిగితే.. ఏజెన్సీ చట్టాల ప్రకారం నాన్-ట్రైట్స్‌కు పట్టాలు ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. నా చిన్నప్పటి నుంచే ఇదే దుస్థితి ఉంది అని రైతు దొడ్డి కృష్ణయ్య తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>