కలం, వెబ్ డెస్క్: పుదీనా అనేది అద్భుతమైన, సువాసనభరితమైన మూలిక. దీన్ని వంటకాలలో ముఖ్యంగా బిర్యానీలు, పచ్చళ్లు, పానీయాలలో ఉపయోగిస్తారు. వర్షాకాలంలో పుదీనా (Mint in Monsoon) ఎక్కువ తినకూడదు అనే మాటను మన పెద్దలు చెబుతుంటారు. అయితే నిజంగా వర్షాకాలంలో పుదీనా తినకూడదా? ఇది కేవలం అపోహ మాత్రమేనా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం.. వర్షాకాలంలో పుదీనా తీసుకోకపోవడమే మంచిదట. ఎందుకంటే మన శరీరం అన్ని కాలాల్లోనూ ఓకే విధంగా ప్రవర్తించదు. అందుకే కాలాలు మారినప్పుడు మన ఆహారపు అలవాట్లు కూడా మారాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. సాధారణంగా పుదీనా అనేది చలువ చేసే గుణం కలిగిన ఔషద ఆకుకూర. అందుకే దీన్ని వేసవి కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పుదీనా చట్నీ, జల్జీరా, రైతా, పుదీనా షర్బత్ ఇలా అనేక రకాలుగా వాడుతుంటారు.
అయితే వేసవిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పుదీనా, వర్షాకాలంలో మాత్రం ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. వర్షాకాలంలో పుదీనా తినడం వలన ఎటువంటి నష్టాలు కలుగుతాయి, పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పడు తెలసుకుందాం.
పుదీనాతో బ్యాక్టీరియా ముప్పు
వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నేలకు దగ్గరగా పెరిగే పుదీనా ఆకులపై కంటికి కనిపించని బ్యాక్టీరియా, వైరస్‌లు, కీటకాల గుడ్లు చేరుతాయి. ఈ ఆకులను ఎంత కడిగినా కొన్ని సార్లు ఆ సూక్ష్మజీవులు పూర్తిగా నశించవు. అందుకే వీటిని పచ్చిగా తినడం వలన ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, కడుపు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
జఠరాగ్ని ప్రభావం
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో మన శరీరంలో ఆహారాన్ని అరిగించే శక్తి (జఠరాగ్ని) బలహీనపడుతుంది. జఠరాగ్ని బలహీనపడినప్పుడు జీర్ణవ్యవస్థ సున్నితంగా మారుతుంది. పుదీనా స్వభావరీత్యా చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నప్పుడు చలువ చేస పదార్థాలు తీసుకోవడం వల్ల వాత, కఫ దోషాలు అసమతుల్యంగా మారి కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.
వర్షాకాలంలో చర్మ సమస్యల రిస్క్
వర్షాకాలంలో మన శరీరంలో రక్తం శుద్ధి ప్రక్రియ వేగం తగ్గుతుంది. ఈ కాలంలో కలుషితమైన, తర్వగా జీర్ణం కాని ఆకుకూరలను తీసుకోవడం వల్ల రక్తంపై ప్రభావం పడి చర్మంపై దురదలు, అలర్జీలు, మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.
అందుకే ఈ సీజన్ లో పుదీనా వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా రైతా, సలాడ్స్, జ్యూస్ ల రూపంలో పచ్చిగా అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ ఖచ్చితంగా వాడాల్సి వస్తే ఆకులను వేడి నీళ్లలో కొద్దగా ఉప్పు వేసి బాగా కడగి, పూర్తిగా ఉడికించిన వంటకాల్లో మాత్రమే పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.

