Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రంప్ ‘వన్ షాట్’ కామెంట్లపై ఇరాన్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరాన్ (Iran) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంత్యక్రియల కోసం ఇరాన్ సీనియర్ నాయకత్వమంతా ఒకే చోట చేరినందున, కేవలం వన్ షాట్ తో అందరినీ తుడిచిపెట్టగలనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తప్పుబట్టింది. అమెరికాకు ‘‘నాగరికత కానీ, చరిత్ర కానీ లేవు”అంటూ అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించింది.

‘‘జూలై 4న 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు.. ఖమేనీ మృతిపై ప్రజల్లో ఉన్న ఈ అపారమైన శోకం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అమెరికాకు నాగరికత, చరిత్ర, కనీస గౌరవం లేవు. మనుషులను చంపగలరు.. కానీ వారి ఆదర్శాలను చంపలేరు. మీరు అయాతొల్లా ఖమేనీని మాత్రమే చంపారు. మీరు ఒక అత్తరు సీసాని పగులగొట్టారు. దాంతో ఆ సువాసన ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించింది. ఈ విషయాలు మీకు అర్థం కావు. ఎందుకంటే మీకు చరిత్ర లేదు’’అని ఇరాన్ ఎంబసీ విమర్శించింది.

నేడు టెహ్రాన్ వీధుల్లో ఊరేగింపు

శనివారం ప్రారంభమైన ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ.. కొన్ని రోజుల పాటు సాగనున్నది. దివంగత నేతకు నివాళులర్పించేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో టెహ్రాన్‌లో రోడ్లను మూసివేశారు. వైమానిక పరిమితులు విధించారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ప్రస్తుతం గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లో ఉంచిన ఖమేనీ భౌతికకాయాన్ని సోమవారం రాజధాని వీధుల గుండా ఊరేగించనున్నారు. ఇరాన్ జాతీయ జెండాతో పాటు ఆయన నల్లటి టర్బన్‌ను ఉంచిన ఖమేనీ శవపేటిక పక్కనే, ఫిబ్రవరి దాడుల్లో మరణించిన ఆయన నలుగురు బంధువుల (అందులో ఆయన మనవరాలు కూడా ఉంది) శవపేటికలను కూడా ఉంచారు. టెహ్రాన్‌లో జరిగే అంత్యక్రియల కార్యక్రమాలకు కోటి మందికి పైగా ప్రజలు హాజరవుతారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

మొజ్తబా ఖమేనీ ఎక్కడ?

అయాతొల్లా అలీ ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు ఆయన కొడుకు, ప్రస్తుత వారసుడైన మొజ్తబా ఖమేనీ రాలేదు. ఆదివారం టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియల ప్రధాన ప్రార్థనల్లో ఖమేనీ ముగ్గురు కొడుకులు పాల్గొనగా.. ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా మాత్రం ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారు? ఆయన ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో జరిగిన ప్రార్థనల టైమ్లో ఖమేనీ శవపేటిక వెనుక ఆయన ముగ్గురు కొడుకులు మోస్తఫా, మేసమ్, మసౌద్ ఖమేనీ నిలబడి ఉన్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా టెలికాస్ట్ చేసింది. ‘‘సుప్రీం లీడర్ హాజరయ్యే విషయం మా పరిధిలో లేదు. దీనిపై ఎలాంటి సమాచారమైనా ఆయన కార్యాలయం నుంచే రావాలి” అని అంత్యక్రియల కమిటీ హెడ్ అలీ అక్బర్ పౌర్జంషిడియన్ తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>