Mobile Popup Ad
Mobile Popup Ad

షాకిస్తున్న స‌ర్కార్‌ ఆఫీసుల క‌రెంట్ బిల్లులు!

కలం, తెలంగాణ బ్యూరో: సామాన్యులు ఒక్క నెల కరెంటు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది? దీనికి సమాధానం కష్టమేమీ కాదు. విద్యుత్ సిబ్బంది మన ఇంటికొచ్చి మెయిన్ మీటర్ దగ్గర ఫ్యూజ్ పీకేస్తారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా బిల్లుల్ని వసూలు చేస్తారు. గృహ వినియోగదారులతోపాటు చిరు వ్యాపారులకూ ఇదే ట్రీట్మెంట్! సామాన్య ప్రజలకు వర్తించే ఈ కఠిన నిబంధనలు ప్రభుత్వ శాఖలకు వర్తించవా?! డిస్కంల తీరు చూస్తే ‘వర్తించవు’ అనే సమాధానమే వస్తున్నది. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల పెండింగ్ బిల్లులే సాక్ష్యం. దాదాపు పన్నెండేండ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల ఆఫీసులు, సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్లు.. ఇలాంటివన్నీ వేల కోట్ల రూపాయల బిల్లుల్ని కట్టకుండా పెండింగ్‌లో పెట్టాయి.

ఈ ఏడాది జూన్ చివరి నాటికి ప్రభుత్వ శాఖల నుంచి నార్త్ డిస్కం(ఎన్‌పీడీసీఎల్)కు రావాల్సిన బకాయిలు దాదాపు రూ. 22,601 కోట్లు. ఇటు డిస్కం యాజమాన్యమూ ఒత్తిడి చేయదు.. అటు ప్రభుత్వ విభాగాలూ చెల్లించవు.. అసలుకే అప్పుల ఊబిలో చిక్కుకున్న డిస్కం మొండి బకాయిలతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.

ఏండ్ల‌కేండ్లుగా..!

ప్రభుత్వ ఆఫీసులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, స్థానిక సంస్థల కరెంట్ బిల్లుల బకాయిలు ఏండ్లకేండ్లుగా పేరుకుపోతూనే ఉన్నాయి. సామాన్యులను నానా రకాలుగా తిప్పలు పెట్టి ఇంటి కరెంట్ బిల్లు వసూలు చేసే డిస్కంలు.. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల విషయంలో మాత్రం సైలెంట్ అవుతున్నాయి. పైగా, తమకు అప్పులు పెరిగిపోతున్నాయని, చార్జీలు పెంచాల్సి వస్తున్నదని అంటున్నాయి. డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడిన ప్రతిసారీ.. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరుగుతున్నదని, ఉచిత విద్యుత్ పథకాలతో భారం పడుతున్నదని, సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయడంలో జాప్యం జరుగుతున్నదని, సాంకేతిక నష్టాలు తప్పట్లేదనే పలు కారణాలు యాజమాన్యం నుంచి, అధికారుల నుంచి వినిపిస్తుంటాయి.

విద్యుత్ రంగ నిపుణులు మాత్రం ప్రభుత్వ శాఖల నుంచి వేల కోట్ల రూపాయల బిల్లుల పేమెంట్లు లేకపోవడంతో డిస్కంల రోజువారీ ఆర్థిక నిర్వహణ కూడా కష్టసాధ్యంగా మారుతున్నదని అంటున్నారు. “విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నిర్వహణ పూర్తిగా నగదు ప్రవాహంపైనే ఆధారపడి ఉంటుంది. వినియోగదారుల నుంచి వచ్చే బిల్లులతోనే అవి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు (జెన్‌కో తదితర సంస్థలకు) చెల్లింపులు చేయాలి. ట్రాన్స్‌కోకు ట్రాన్స్ మిషన్ ఛార్జీలూ చెల్లించాలి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు కట్టాలి. ఉద్యోగులకు జీతాలివ్వాలి. ఇక నిర్వహణ ఖర్చు, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌ ఫార్మర్లు, విద్యుత్ లైన్ల అభివృద్ధి వంటి వాటికి నిధులు కూడా ఆ ఆదాయం నుంచే సమకూర్చుకోవాలి” అని వివరించారు.

వసూలు చేయలేక..

– ప్రభుత్వ శాఖల నుంచి బిల్లుల పేమెంట్ లేకపోవడంతో డిస్కంలు అప్పులపై ఆధారపడుతున్నది. ఉత్తర డిస్కం (ఎన్పీడీసీఎల్) ఈ ఏడాది జనవరిలో తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో మొత్తం బకాయిలు రూ. 25,145 కోట్లు ఉన్నాయని, అప్పులు రూ. 24,750 కోట్లు ఉన్నాయని వివరించింది. తీసుకున్న అప్పులపై 2025లో సుమారు రూ.1,969 కోట్లు వడ్డీ రూపంలో కట్టినట్లు తెలిపింది.
– తమకు వసూలు కావాల్సిన మొత్తం మొండి బకాయిల్లో ప్రభుత్వ శాఖల నుంచి రూ. 17,489 కోట్లు, స్థానిక సంస్థల నుంచి రూ. 4,972 కోట్లు ఉన్నట్లు ఉత్తర డిస్కం తెలిపింది. గడిచిన ఐదు నెలల్లో (ఫిబ్రవరి-జూన్) అదనంగా మరో రూ.140 కోట్లు చేరింది. దీంతో మొత్తం రూ. 22,601 కోట్లు కేవలం ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచే రావాల్సి ఉంది. వీటిలో భారీ నీటిపారుదల రంగం వాటానే ఎక్కువ. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టు, దాని ఆఫీసుల నుంచి రావాల్సిన కరెంట్ బకాయిలే దాదాపు 50 శాతం.
– ప్రైవేటు పరిశ్రమల నుంచి మరో రూ. 537 కోట్ల కరెంట్ బిల్లులు ఉత్తర డిస్కంకు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మొండి బకాయిలను వసూలు చేసుకోలేక.. అప్పులపై డిస్కం ఆధారపడుతున్నది. తప్పని పరిస్థితుల్లో చార్జీలు పెంచాల్సి వస్తున్నదని చెప్తున్నది. సౌత్ డిస్కం కూడా ఇదే మాట అంటున్నది.

కాళేశ్వరం బాకీలే ఎక్కువ!

– ఉత్తర డిస్కంకు ప్రభుత్వ శాఖల నుంచి పేరుకుపోయిన మొండి బకాయిల్లో అత్యధిక భాగం భారీ సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్‌లు, మిషన్ భగీరథ (తాగునీటి సరఫ‌రా) విభాగాలకు చెందినవే.
– కాళేశ్వరం ప్రాజెక్టులోని రామడుగు ఈఈ కార్యాలయం లెక్కలోకి వచ్చే సుమారు రూ.2,492 కోట్లు, నందిమేడారం పంప్ హౌస్ కరెంటు బాకీ రూ.2,460 కోట్లు, ఇల్లంతకుంట (తిప్పాపూర్ ఈఈ ఆఫీస్) బకాయి రూ.1,218 కోట్లు, కన్నేపల్లి పంప్ హౌస్ బకాయి రూ.699 కోట్లు, సుందిళ్ల లిఫ్ట్ బకాయిలు రూ.656 కోట్లు, అన్నారం పంప్ హౌస్ బకాయి రూ. 485 కోట్లు ఉన్నాయి. ముర్ముర్ (రామగుండం) ఎలక్ట్రికల్ విభాగం జనరల్ మేనేజర్ ఆఫీసు బాకీ రూ. 860 కోట్లు, కరీంనగర్ జిల్లా చేగుర్తి ఎలక్ట్రికల్ ఈఈ కార్యాలయం బకాయి రూ. 1,033 కోట్లు ఉన్నాయి.
– రెండున్నరేండ్లుగా కాళేశ్వరం పంప్ హౌస్లు పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో పేరుకుపోయిన ఈ బకాయిలన్నీ 2023 అక్టోబర్ మొద‌టి వినియోగానికి సంబంధించినవే.

ఎన్‌పీడీసీఎల్ (ఉత్తర డిస్కం) లెక్కలు :

(ఈ ఏడాది జనవరిలో సమర్పించిన ఏఆర్ఆర్ నివేదిక ప్రకారం)

సంస్థకున్న అప్పులు : రూ. 24,750.33 కోట్లు
ఏడాదికి సగటున కడుతున్న వడ్డీ: రూ. 1,969 కోట్లు
ప్రభుత్వ విభాగాల బకాయిలు : రూ. 22,601 కోట్లు
ప్రైవేటు పరిశ్రమల బకాయిలు : రూ. 537.56 కోట్లు
ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ బకాయిలు : రూ. 4,113.26 కోట్లు
గృహజ్యోతి స్కీమ్ కింద వచ్చిన సబ్సిడీ : రూ. 367.88 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>