కలం, ఖమ్మం బ్యూరో: కొత్త మున్సిపాలిటీగా మారిన కల్లూరుకు ఎక్కువ నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దుతామని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. తాను కల్లూరు మండలంలోనే పుట్టి పెరిగానని, పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గం ఎప్పటికీ తన సొంతిల్లే అన్నారు.
ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి రూ.15 కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. రూ.8.60 కోట్లతో తిరువూరు ఎక్స్ రోడ్ జంక్షన్, రూ.6.30 కోట్లతో లోకవరం-పెనుబల్లి రహదారిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ, లింక్ రోడ్లు, వరద నీటి కాలువ పనులు ఉన్నాయి.
5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..
ఈ సందర్భంగా బహిరంగ సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు సత్తుపల్లి నియోజకవర్గానికి రెండు విడతల్లో 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇళ్లు అందిస్తామన్నారు. రైతు భరోసా కింద తొలి విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తున్నట్లు తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 ప్రోత్సాహకం ఇస్తూ ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను గుర్తు చేస్తూ, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

