కలం, ఖమ్మం బ్యూరో: వరి సాగులో రైతులు ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆరోగ్యకరమైన నారుమడి తయారీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఖమ్మం (Khammam) జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. అప్పుడే మంచి దిగుబడి, అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎకరం పొలానికి నాట్లు వేయడానికి సుమారు 4 సెంట్ల భూమిని నారుమడిగా ఎంచుకోవాలన్నారు. మెత్తగా దుక్కి చేసి సమతలంగా సిద్ధం చేసుకోవాలన్నారు.
ఇలా చేయండి..
దమ్ము నారుమడి పద్ధతిని పాటించే రైతులు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేయాలని బాబురావు అన్నారు. విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత 36 గంటలు మూట కట్టడం వల్ల విత్తనాలు త్వరగా, సమానంగా మొలకెత్తుతాయని వివరించారు. అలా మొలక వచ్చిన విత్తనాలను సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని సూచించారు.
నారు దశలోనే సంరక్షణ..
నారుమడిలో పలుచగా నీరు నిల్వ ఉంటే నారు ఆరోగ్యంగా పెరిగి, సరైన సమయానికి నాట్లకు సిద్ధమవుతుందని బాబురావు తెలిపారు. నారు దశలోనే సరైన సంరక్షణ చేపడితే పంట ప్రారంభం నుంచే ఎదుగుదల బాగుంటుందని చెప్పారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సాంకేతిక సలహాలను పాటిస్తూ పంటను నిరంతరం పర్యవేక్షించుకోవాలని కోరారు.

