కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetty Srinivas) ఆరోపించారు. ప్యాకేజీలు తీసుకొని పవన్‌ను టార్గెట్ చేసి తిడుతున్నారని చెప్పారు. ఇటీవల కొందరు యూట్యూబర్ల అరెస్టుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దళిత సభ నిర్వహించుకుంటే అందులో పవన్ కల్యాణ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. గతంలో జగన్ పాలనలో దళితులు ఇబ్బందులు పడ్డా మాట్లాడని వాళ్లు ఇప్పుడు ఎందుకు విష ప్రచారాలు చేస్తున్నారని నిలదీశారు.
రావణ్‌ను అరెస్ట్ చేస్తే వైసీపీకి ఎందుకు ఇబ్బంది అవుతోందని బొలిశెట్టి మండిపడ్డారు. అసలు దళిత సభలో పవన్ కల్యాణ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దళితుల హక్కుల కోసం సభలు పెట్టారా? పవన్ కల్యాన్‌ను తిట్టాలని ఎవరైనా వైసీపీ వాళ్లు మీకు డబ్బులు ఇచ్చారా అని నిలదీశారు. ఇందులో నటుడు ప్రకాశ్ రాజ్ ఎందుకు ఎంటర్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు. వీళ్లందరికీ వైసీపీ పార్టీ నాయకులు, జగన్ ప్యాకేజీలు ఇస్తూ ఒక పద్ధతి ప్రకారం కుట్రలు చేస్తున్నారని ఆరోపంచారు. ఎవరైనా హద్దులు మీరి మాట్లాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

