కలం, వెబ్ డెస్క్ : కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు (Bikknoor) మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు ఏకంగా గ్రామ పంచాయతీకి చెందిన చెత్త సేకరించే ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న ట్రాక్టర్‌ను దొంగతనం చేసి తీసుకెళ్తున్న క్రమంలో, నియంత్రణ కోల్పోయి పంచాయతీ ప్రహరీ గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రహరీ గోడ ధ్వంసమైంది.
ఈ దొంగతనం, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ట్రాక్టర్ ఢీకొట్టిన శబ్దం రావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే స్పందించి, దొంగతనానికి పాల్పడిన నలుగురిలో ఒక యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేయగా, మిగిలిన ముగ్గురు యువకులు ఘటనా స్థలం నుండి పరారయ్యారు.
ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ సాయగౌడ్, గ్రామస్తులు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకులు పూర్తిగా మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ దొంగతనానికి, ప్రమాదానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: మెటాకు కేంద్రం బిగ్ షాక్… ఇన్‌స్టాలో ఆ కంటెంట్ పై నోటీసులు
Follow Us On: Instagram

