కలం, కరీంనగర్ బ్యూరో : గ్రామ పంచాయతీల అభివృద్ధికి అందుతున్న నిధులన్నీ(Panchayat Funds) ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. అయితే గ్రామాల అభివృద్ధికి వినియోగించాల్సిన ఈ నిధులను పంచాయతీ సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
శనివారం సాయంత్రం జగిత్యాల (Jagtial) జిల్లా కథలాపూర్ మండలంలోని గంభీర్‌పూర్, పోసానిపేట, ధూంపేట్ గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గంభీర్‌పూర్ గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి గ్రామంలోని తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలన్నీ కేంద్ర నిధులతోనే అమలవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని అభివృద్ధికి వినియోగించకుండా ఎందుకు మళ్లిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

