పొంగులేటి అక్రమాలు బయటపెడతా: బీజేపీ ఎమ్మెల్యే

కలం, నిర్మల్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన అక్రమాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోటి ఎకరాల భూములను 22(ఏ) నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కమీషన్ల కోసం పీడిస్తున్న వ్యవహారాన్ని పొరపాటుగా పేర్కొని మంత్రి పొంగులేటి తప్పించుకోలేరని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

మూడు నెలల క్రితమే యాదగిరిగుట్ట మండలంలో 40 వేల ఎకరాలను 22(ఏ) నిషేధిత జాబితాలో చేర్చిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని అప్పుడే చెప్పారని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై సమాధానం చెప్పకుండా విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 22(ఏ) నిషేధిత జాబితాలో ఉన్న భూములు, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22(ఏ)లో చేర్చిన భూముల వివరాలను శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలని కోరారు.

ఫినిక్స్, రాఘవ కన్ స్ట్రక్షన్ మధ్య జరిగినట్లు చెబుతున్న రూ.15 వేల కోట్ల లావాదేవీలు, 102 షెల్ కంపెనీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ఆధారాలను ఈడీ, సీబీఐకి అందజేయడంతో పాటు లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారాలపై ఆధారాలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌కు బినామీగా ఉన్నట్లు ఆరోపిస్తున్న ఫినిక్స్‌ కంపెనీతో రాఘవ కంపెనీకి జరిగిన లావాదేవీల వివరాలను కూడా బయటపెడతానని పేర్కొన్నారు. ఫినిక్స్‌ కంపెనీ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ధరణిని భూ భారతి పేరుతో మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో భూ దోపిడీకి పాల్పడుతోందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైనట్లు చెబుతున్న అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కాకముందు, మంత్రి అయిన తర్వాత కూడబెట్టిన ఆస్తులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>