Mobile Popup Ad
Mobile Popup Ad

మరమ్మతులు పూర్తయ్యాకే బ్యారేజీల నిర్వహణ: మంత్రి ఉత్తమ్

కలం, నల్లగొండ బ్యూరో: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్ఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి నిర్వహిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కంటే ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.10 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయిందని, ఆ ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ముందస్తు మరమ్మతులు పూర్తికాకుండానే బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని, అలాంటి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణంతో పాటు దిగువన ఉన్న సుమారు 40 గ్రామాల ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్ని లోపాలను శాస్త్రీయంగా సరిదిద్దిన తర్వాతే ముందుకు వెళ్తామని చెప్పారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా అధునాతన, శాస్త్రీయ విధానంలో చేపడుతున్నామని మంత్రి వివరించారు.

భూగర్భ సాంకేతిక పరీక్షలు, నాన్-డిస్ట్రక్టివ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ సర్వేలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. వందకు పైగా బోర్ హోల్స్ ద్వారా నిర్మాణాల అంతర్గత పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఎన్‌డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీల అన్ని గేట్లను ఎత్తి ఉంచి, నీటి ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ, అంతర్జాతీయ నిపుణులు కలిసి పునరుద్ధరణ నమూనాలను పరిశీలిస్తున్నారని, భద్రతపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్ భద్రతకు ప్రాధాన్య‌త‌

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత, నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. అవసరమైన అన్ని మరమ్మతుల అంచనాలను వెంటనే సిద్ధం చేసి పరిపాలనా అనుమతులకు పంపాలని అధికారులను ఆదేశించారు. లైనింగ్ అవసరమైన కాలువలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని, పట్టణ ప్రాంతాల గుండా వెళ్లే ఓపెన్ కాలువలను దశలవారీగా కప్పివేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దీనివల్ల కాలువల్లో చెత్త వేయడాన్ని అరికట్టడంతో పాటు పరిశుభ్రత మెరుగుపడుతుందని చెప్పారు. ప్రతి సాగునీటి పనిలో నాణ్యత, వేగం అనే రెండు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వంలో ప్రకటించిన అనేక సాగునీటి పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భూమిపై అమలు చేస్తూ రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అంతకుముందు ఆయన మిర్యాలగూడలో ఎగుమతులకు అనువైన ఆధునిక రైస్ మిల్లును ప్రారంభించారు. అనంతరం గుల్లపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్లు ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>