కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైతే జాతీయ జట్టులో ఆడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) తరఫున ఆడే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ది హండ్రెడ్ టోర్నీ జూలై 21న ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో తొలి టెస్టు జూలై 25న మొదలవుతుంది. ఈ రెండు షెడ్యూళ్లు దగ్గరగా ఉండటంతో అబ్రార్ ఏ టోర్నీకి ప్రాధాన్యం ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఈ పరిస్థితితో అబ్రార్, ఆయన ఏజెంట్ కూడా సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ టెస్టు జట్టులో చోటు దక్కితే ది హండ్రెడ్‌లో పాల్గొనే అవకాశం దెబ్బతింటుందని తెలుస్తోంది. అబ్రార్‌ను ఇటీవల భారతీయ యజమాన్యం ఉన్న సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు 1.90 లక్షల పౌండ్లకు, అంటే సుమారు రూ.2.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నిర్ణయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. జట్టు యజమానిగా ఉన్న కావ్య మారన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ ఆటగాడిని జట్టులోకి తీసుకోవడంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వేలంలో అబ్రార్‌ను దక్కించుకునే ప్రక్రియలో కావ్య మారన్ స్వయంగా పాల్గొన్నారనే వార్తలతో ఈ వివాదం మరింత పెరిగింది. అబ్రార్ ఏజెంట్‌కు దగ్గరగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం, ఒకవేళ అతను ది హండ్రెడ్‌లో ఆడకపోతే అది సన్‌రైజర్స్ లీడ్స్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే విమర్శలను ఎదుర్కొని అతడిని జట్టులోకి తీసుకున్న నేపథ్యంలో, అబ్రార్ టోర్నీలో ఆడటం జట్టుకు కీలకమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు పాకిస్థాన్ జాతీయ సెలక్షన్ కమిటీ సోమవారం వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించనుంది. వెస్టిండీస్ బ్యాటర్లపై లెగ్ స్పిన్నర్ ప్రభావం చూపగలడని భావిస్తున్న సెలెక్టర్లు అబ్రార్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోయింది. ప్రస్తుతం రెండు దేశాలు ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి బహుళ దేశాల టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
ఆ తర్వాత నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్లో అవకాశం లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారత యాజమాన్యం ఉన్న చాలా లీగ్ జట్లు కూడా వారిని ఎంపిక చేయడం అరుదుగా కనిపించింది. అయితే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వివక్షకు తావులేదని స్పష్టం చేసిన తర్వాతే సన్‌రైజర్స్ లీడ్స్ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసింది.

