Mobile Popup Ad
Mobile Popup Ad

కామారెడ్డిలో ‘కారు’కు కరువైన సారథి..!

కలం, నిజామాబాద్ బ్యూరో: ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో ప్రస్తుతం గులాబీ దళం ఉనికి చాటుకోవడానికే ఇబ్బంది పడుతున్నది. ‘కేసీఆర్ సారు రారు.. కారు స్టీరింగ్ పట్టే గట్టి సారథి లేరు’ అన్న చందంగా ఇక్కడి బీఆర్ఎస్ కేడర్ అయోమయంలో మునిగిపోయింది.1994, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన గంప గోవర్ధన్, తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత 2014, 2018 సాధారణ ఎన్నికల్లోనూ గంప గోవర్ధన్ గెలుస్తూ వచ్చారు. అయితే, 2018 ఎన్నికల్లో ఆయన కేవలం 5,007 ఓట్ల బొటాబొటి మెజారిటీతో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గట్టెక్కారు. నియోజకవర్గంలో పార్టీ గ్రాఫ్ పడిపోతోందని గ్రహించిన గులాబీ అధిపతి కేసీఆర్, తానే స్వయంగా ఇక్కడి నుంచి రంగంలోకి దిగారు.

కేసీఆర్‌కు ఊహించని ఓటమి

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం కోనాపూర్ తన సొంత గ్రామం కావడంతో, ‘జన్మభూమిని కర్మభూమిగా’ మార్చుకుంటానని భావించారు. అయితే, ఇక్కడ గులాబీ వాడిపోయి కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి చేతిలో కేసీఆర్ 6,741 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యారు.

సారథి లేని కారు..

ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ మళ్లీ కామారెడ్డి వైపు కన్నెత్తి చూడలేదు. ఇక మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా లేరు. ఇటీవల ధాన్యం కొనుగోళ్లు, యూరియా సమస్యలపై పార్టీ పిలుపు మేరకు ఒకట్రెండు ప్రెస్ మీట్లు పెట్టడం మినహా ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించడం లేదు. నియోజకవర్గంలో అటు అధికార కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎమ్మెల్యేలను గట్టిగా ఎదుర్కొంటూ నిత్యం ప్రజల్లో ఉండే బలమైన నాయకత్వం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఢీలా పడింది.

కొత్త సారథి కోసం అన్వేషణ

ప్రస్తుతం కామారెడ్డి సెగ్మెంట్లో గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ తప్ప చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. సీనియర్ నేత నిట్టూ వేణుగోపాల్ రావు, ఆయన కుమార్తె మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నవి ఎన్నికల ముందే పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందు, ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో క్షేత్రస్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీల్లోకి వలసపోతున్నారు. ఈ నేపథ్యంలో, కామారెడ్డిలో కారు స్టీరింగ్ అప్పగించడానికి అధిష్టానం ఒక కొత్త సారథి కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. మరి ఆ కొత్త నేత ఎవరో.. కారును ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>