కలం, వెబ్ డెస్క్ : అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న శపగీజా క్రికెట్ లీగ్ టీ20 మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా అభిమానులు తమకు నచ్చిన స్టార్ క్రికెటర్లను కలవడానికి, హగ్ చేసుకోవడానికి లేదా ఆటోగ్రాఫ్ కోసం భద్రతా వలయాన్ని దాటుకుని మైదానంలోకి రావడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక క్రేజీ అభిమాని ఏకంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) తలపై ఉన్న క్యాప్‌ను దొంగిలించి పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్, మిస్ ఐనక్ నైట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. మొదటి ఇన్నింగ్స్ సమయంలో మిస్ ఐనక్ నైట్స్ కెప్టెన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఫీల్డింగ్ చేస్తుండగా, ఒక అభిమాని హఠాత్తుగా భద్రతా సిబ్బందిని దాటుకుని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గుర్బాజ్ అతడిని చూసి ఎంతో స్పోర్టివ్‌గా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు.
అయితే ఆ ఫ్యాన్ మాత్రం ఊహించని విధంగా మెరుపు వేగంతో గుర్బాజ్ తలపై ఉన్న క్యాప్‌ను లాక్కుని, స్టేడియం వెలుపలికి పరుగు లంకించుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్స్ అతడిని పట్టుకోవడానికి వెనకాలే పరిగెత్తినా లాభం లేకపోయింది. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ క్రికెటర్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్లకు కఠిన సెక్యూరిటీ కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.

