Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు సమస్యలు సైడ్.. అప్పులే మెయిన్ హైలైట్!

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నాలుగు రోజులుగా పార్టీల ప్రాధాన్యతలు మారిపోయాయి. నిన్నమొన్నటి వరకూ రబీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతులకు అన్యాయం, రైతు భరోసా విడుదల చేయని సర్కారు, సంక్షోభంలో వ్యవసాయ రంగం.. ఇలాంటి అంశాలతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కల్లాల చుట్టూ తిరిగారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో ముచ్చటించారు. ర్యాలీలు, ధర్నాలతో బీఆర్ఎస్ ప్రత్యేక ప్రోగ్రామ్ తీసుకున్నది. ‘బీజేపీ భరోసా’ పేరుతో ఆ పార్టీ లీడర్లు జిల్లాల్లో పర్యటించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఈలోగా ఖరీఫ్ రానే వచ్చింది. ఎల్‌ నినో కారణంగా వర్షాలు పడవని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. నైరుతి టచ్ అయ్యి నెల రోజులు దాటినా రాష్ట్రంలో వర్షాల్లేవ్. పరిస్థితిని గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం రైతుభరోసా ఫండ్స్ విడుదల చేసింది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కానీ, రైతుల పక్షాన ఉంటామన్న బీఆర్ఎస్, బీజేపీ సైలెంట్ అయిపోయాయి. రైతుల సమస్యలపై గళం విప్పాల్సిన ప్రతిపక్షాలు ఆ విషయాన్ని ఎత్తడం లేదు. పాలక పక్షం కూడా ముందస్తు కార్యాచరణను ప్లాన్ చేసిందీ లేదు.

రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం (Telangana Politics) అంతా కేవలం ‘అప్పుల’ చుట్టే తిరుగుతున్నది. సవాళ్లు, ప్రతిసవాళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ అప్పుల పాలిటికల్స్ పీక్స్కు చేరుకుంది. ఇది హైడ్రామా అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ.. ఖరీఫ్ సాగులో రైతులు పడుతున్న తిప్పలపై మాత్రం నోరు మెదిపే దిక్కులేదు. కష్టకాలంలో అన్నదాతలకు అండగా ఉండాల్సిన టైమ్ లో అప్పుల పంచాయితీలో లీడర్లు మునిగితేలుతున్నారు.

రైతులకు అండగా ఉంటామని, రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ గొప్పగా చెప్పుకున్న కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పుడు మౌనం దాల్చారు. అన్నదాతలకు కష్టకాలంలో అండగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు చేతులెత్తేశారు. గత ప్రభుత్వ అప్పులు, గురుకుల టెండర్లలో అవకతవకల పేరుతో బీఆర్ఎస్ రూట్ మార్చారు. ప్రభుత్వానికి, మంత్రులకు కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులంతా ఛాలెంజ్‌లు విసిరారు.

ఖరీఫ్ పంట ప్రారంభంలోనే రైతుభరోసా ఇచ్చిన మైలేజ్ ప్రభుత్వానికి రాకూడదనే పక్కా ప్లాన్‌తోనే హఠాత్తుగా అప్పుల అంశాన్ని తెరమీదికి తెచ్చారనే వాదన ఉంది. చేసింది చెప్పుకోలేకపోతున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు రోజుల కింద నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రమంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఖరీఫ్, ఎల్‌ నినో, రైతుల కష్టాలు.. ఈ టాపిక్ అంతా డైవర్ట్ అయింది. ఉచ్చు వేసింది ఎవరు, ఇరుక్కున్నది ఎవరు అనే చర్చ మొదలైంది.

సీన్‌లో లేకుండాపోయిన బీజేపీ

గత ప్రభుత్వ అప్పులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో కల్లాల దగ్గరకు, ఐకేపీ సెంటర్లకు వెళ్ళి రైతుల్ని పలకరించి అండగా ఉంటామని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రం ఇస్తున్న మద్దతును ప్రస్తావించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులను బీజేపీ పట్టించుకోలేదు. ఖరీఫ్ కష్టాలు మొదలైనా బీజేపీ గ్రామాల్లోకి వెళ్లలేదు. పూర్తిగా పొలిటికల్ యాక్టివిటీస్‌లో మునిగిపోయింది. ‘బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టినా ఇప్పుడు సీజన్ ప్రారంభంలో రైతుల కష్టాలను గాలికొదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. రైతు సమస్యలపై కొనసాగాల్సిన ఒత్తిడి మధ్యలోనే తగ్గిపోయిందనే అభిప్రాయం వ్యవసాయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

జీ-రామ్-జీ చట్టంపై నోరెత్తని ప్రతిపక్షాలు

ఇంతకాలం అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీ-రామ్-జీ చట్టాన్ని తెచ్చింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ఇక నుంచి రాష్ట్రాలు విధిగా 40 శాతం నిధులను భరించక తప్పలేదు. దీనికి తోడు కొన్ని నిబంధనలు ఉపాధి కూలీ కార్మికులకు అన్యాయం చేసేలా ఉన్నాయని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టం అమలును వాయిదా వేయించడంలో, నిబంధనలను సడలించేలా చొరవ తీసుకోవడంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీజేఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయ సీజన్‌లో కూలీలకు 60 రోజుల విరామం ప్రకటించాలని కేంద్రం ఈ కొత్త చట్టంలో నిబంధన పెట్టినా దాని ద్వారా గ్రామీణ పేద కుటుంబాలకు జరిగే అన్యాయంపై లీడర్లలో ఆందోళనల్లేవ్.. కేంద్రంపై ఒత్తిడి లేదు.. అనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

మారిన ప్రాధాన్యతలు, ఎజెండా

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా, వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నా, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు చర్చల్లోకే రావడం లేదు. ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ, రైతుభరోసా బకాయిలు, మహిళలకు అమలు కాని హామీలపై ఇంతకాలం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తన ప్రయారిటీని మార్చుకున్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికలు, రెండేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పొలిటికల్ ఎజెండా, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నదనే ఆరోపణలూ ఉన్నాయి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పుల గురించి ముఖ్యమంత్రి ఇటీవల కామెంట్ చేయడం, దానికి గులాబీ లీడర్లు రెస్పాండ్ కావడం, చివరికి అది సవాళ్ల స్థాయికి చేరుకోవడంతో మొత్తం పొలిటికల్ డిబేట్ దీని చుట్టే తిరుగుతున్నది. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలు ఇవ్వడం, గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను తప్పుబట్టడంపై అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రైతుల సమస్యలకు స్థానం లేకుండాపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>