కలం, వెబ్ డెస్క్ : బెంగళూరులోని జ్ఞానభారతి మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైసూర్ రోడ్డులోని జ్ఞానభారతి మెట్రో స్టేషన్ సమీపంలో ప్రయాణిస్తున్న కేరళ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు (BUS Fire Accident) చెలరేగాయి. ఇంజిన్‌లో మొదలైన మంటలు బస్సు ముందు భాగం, లోపలికి వ్యాపించాయి. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రాణాపాయం తప్పింది.
ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యారు. బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండటం, వారు వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం సంభవించలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేకుంటే డీజిల్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

