కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి ‘భూ రీ-సర్వే’ కార్యక్రమం పటిష్ట ప్రణాళికతో, వేగంగా కొనసాగుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1946లో భూ సర్వే జరిగింది. గత 80 ఏళ్లుగా ఎలాంటి సర్వే జరగకపోవడంతో భూ రికార్డుల్లో అనేక వ్యత్యాసాలు, సరిహద్దు వివాదాలు నెలకొన్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, నిజమైన భూ యాజమానులకు న్యాయం చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రీ-సర్వే చేపట్టింది.
6 మండలాల్లో పూర్తి..
మెదక్ జిల్లాలోని 12 మండలాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియ పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. ఇప్పటికే ఆరు మండలాల్లో సర్వే విజయవంతంగా పూర్తయింది. మిగిలిన ఆరు మండలాల్లో సర్వే చేయడానికి అనుగుణంగా, సంబంధించిన గ్రామాలకు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. గత సర్వేలకు భిన్నంగా ఈసారి సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు.
క్యూ-జీఐఎస్ సాంకేతికతతో సర్వే..
క్వాంటమ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (QGIS) సాఫ్ట్‌వేర్ ద్వారా భూ పార్సల్ రికార్డుల తయారీ, డేటా సమన్వయం, మ్యాపింగ్, డిజిటల్ రికార్డులను అత్యంత కచ్చితత్వంతో రూపొందిస్తున్నారు. ఇందుకోసం మండల సర్వేయర్లతో పాటు, ప్రత్యేకంగా నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు సమగ్ర శిక్షణ ఇచ్చారు. భూముల సమగ్ర సర్వేకు అవసరమైన ఆధునిక సర్వే ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉంచారు.
ఆధునిక డ్రోన్ టెక్నాలజీ, ఈటీఎస్ (ETS) యంత్రాల ద్వారా సాగుతున్న ఈ భూ రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసి, ప్రతి భూ కమతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఆన్‌లైన్ డిజిటలైజేషన్ పూర్తి చేస్తున్నారు. భూముల సరిహద్దులు స్పష్టంగా ఉండేందుకు వీలుగా లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా భూములకు కొత్తగా ‘ల్యాండ్ పార్శిల్ మ్యాప్ (LPM)’ నెంబర్లను కేటాయిస్తున్నారు.
తప్పనిసరిగా గ్రామసభల నిర్వహణ..
భూ సర్వే నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. సర్వే బృందాలు ప్రతి సబ్ డివిజన్ నెంబర్ వారీగా వివరాలను సేకరించి, గ్రామసభల ద్వారా ప్రజల సమక్షంలోనే సర్వే ప్రక్రియ వివరిస్తున్నారు. గ్రామస్థులు, రైతుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రికార్డుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 18 గ్రామసభలు నిర్వహించారు. భూముల రీ సర్వేకు గ్రామస్థులు అంగీకారం కీలకం కాబట్టి, గ్రామసభల ఏర్పాటులో నిర్దేశిత డెడ్‌లైన్ తప్పనిసరిగా పాటించడంతో పాటు, ఎలాంటి వాయిదాలు లేకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. జిల్లాలో చాలా వరకు అటవీ ప్రాంతం ఉటుంది. అటవీ భూములకు సంబంధించిన రీ సర్వే, భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు.
రికార్డుల ఆధునికీకరణ ఇలా..
భూముల రీ సర్వేలో భాగంగా గ్రామాల్లో పలు రకాల భూ వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా ముఖ్యమైన నక్షా(మ్యాప్)లను నవీకరణ చేస్తున్నారు. గతంలో ఎన్నో ఏళ్లుగా భూముల క్రయవిక్రయాలు, వారసత్వ పంపకాలు జరిగి రికార్డుల్లో పేర్లు మారినప్పటికీ.. నక్షా (మ్యాప్)లలో అవి సబ్ డివిజన్ కాలేదు. ఈ కారణంగానే గ్రామాల్లో గట్టు తగాదాలు, పొజిషన్ సమస్యలు తరుచుగా వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఇందుకు పరిష్కారంగా రీ-సర్వే ద్వారా రికార్డులతో పాటు భూ నక్షాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేస్తున్నారు.
వివరాలు తనిఖీ చేశాకే..
భూములకు సంబంధించిన పలు రికార్డుల్లో పేర్లు ఉండి, క్షేత్రస్థాయిలో కబ్జా లేని వారి వివరాలను తనిఖీ చేస్తున్నారు. కాగితాలు లేని సాగుదారులు తరతరాలుగా సాగులో ఉండి, ఎలాంటి భూ యాజమాన్య పత్రాలు కాగితాలు లేని వారి సమస్యలను పరిశీలిస్తున్నారు. అవి ప్రభుత్వ భూములా లేదా పట్టా భూములా.. అనే కోణంలో సరి చూస్తున్నారు. రీ సర్వేలో భాగంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ బౌండరీ ఫిక్సింగ్, ప్రభుత్వ భూములు, గ్రామకంఠం సంబంధిత విషయాల్లో పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ భూములను రక్షిస్తున్నారు. భూముల రీ సర్వే తర్వాత దశాబ్దాలుగా పెండింగులో ఉన్న భూ వివాదలకు పరిష్కారం చూపేలా పటిష్టంగా, ప్రణాళికబద్దంగా సర్వే నిర్వహణ, రికార్డుల తయారీ చేస్తున్నారు.
ప్రతి భూమికీ ‘భూధార్’ కార్డు..
సర్వే ప్రక్రియ అంతా ఆర్డీవోలు, తహసీల్దార్ల, రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పారదర్శకంగా సాగుతోంది. హడావుడి లేకుండా, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు అస్కారం లేకుండా, పక్కాగా రికార్డులను సిద్ధం చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూ కమతానికి ఆన్‌లైన్ డిజిటలైజేషన్ పూర్తి చేసి, విశిష్టమైన ‘భూధార్’ నంబర్‌తో ఐడీ కార్డు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా భవిష్యత్తులో మ్యుటేషన్ ప్రక్రియలు, ప్రభుత్వ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా, పారదర్శకంగా అందుతాయని అధికారులు చెబుతున్నారు. రైతులు, భూ యజమానులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా క్షేత్రస్థాయిలో వచ్చే సర్వే బృందాలకు పూర్తిస్థాయిలో సహకరించి, భూ సమస్యలను పరిష్కరించుకోవాలని మెదక్ జిల్లా అధికారులు కోరుతున్నారు.

