కలం, నిర్మల్: సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని ఎంజేపీటీబీసీ సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు (Nirmal Additional Collector venkateshwarlu) శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులతో మమేకమై వారి చదువు, ఆరోగ్యం, వసతి, ఆహార నాణ్యతపై ఆరా తీశారు.
అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్, వారికి అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందించేలా నిరంతరం శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

