Mobile Popup Ad
Mobile Popup Ad

మూడు పువ్వులు ఆరు కాయలుగా.. ‘మట్టి మాఫియా’

కలం, జోగులాంబ గద్వాల: ధరూర్ మండలంలో మట్టి మాఫియా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమంగా మట్టి తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో‌‌ ర్యాలంపాడు రిజర్వాయర్ గ్రావిటి కెనాల్ నిర్మించారు. రిజర్వాయర్ గ్రావిటీ కెనాల్ వద్ద నిల్వ ఉంచిన ప్రభుత్వ మట్టిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిఘా లేకపోవడంతో అక్రమార్కులు గ్రావిటి కెనాల్ మట్టిని ధరూర్, కేటిదొడ్డి మండలాలతో పాటు గద్వాల పట్టణంలో వెంచర్లు, ఇండ్లకు మట్టి తరలిస్తూ అడ్డూ అదుపు లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా ర్యాలంపాడు కాలువ మట్టిని అక్రమంగా బహిరంగానే తరలిస్తున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మట్టి వ్యాపారులు అధికారులను, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని తమకు ఎదురే లేదన్న ధోరణిలో తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

మట్టి మాఫియాకో న్యాయం మాకో న్యాయమా?

గత వారం రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా జాంపల్లి వద్ద ఉన్న ర్యాలంపాడు కాలువ మట్టిని అక్రమార్కులు టిప్పర్లలో తరలిస్తూ పెద్దగా శబ్దాలు చేస్తూ రాకపోకలు సాగిస్తుండడంతో జాంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే పంటపొలాలను ర్యాలంపాడు రిజర్వాయర్ కాలువ నిర్మాణానికి ఇస్తే కొంతమంది అక్రమంగా మట్టి తవ్వుతున్నారని వారు వాపోయారు. కనీసం పోలీసులుగానీ, ప్రభుత్వంగానీ, ఇరిగేషన్ అధికారులుగానీ అడ్డుకోవడంలొ విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ మట్టిని తరలించాల్సిందిగా ధరూర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదని తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కాలువ కోసం‌ భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతుల ఇండ్ల నిర్మాణాలకు ఎప్పుడైన మట్టిని తరలిస్తుంటే ధరూర్ పోలీసులు క్షణాలలో వచ్చి మట్టి తరలింపును నిలిపివేసి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. గత వారం రోజుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రిజర్వాయర్ కాలువ మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జాంపల్లి రైతులు ప్రశ్నిస్తున్నారు.

పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు మాముళ్లు అందాయి కాబట్టి మట్టి రవాణను అడ్డుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా బరితెగించి మట్టి తరలిస్తున్న అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ దోపిడీకి పాల్పడుతున్న మట్టి మాఫియాపై, వారికి సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>