Mobile Popup Ad
Mobile Popup Ad

‘సై’ సినిమాలో వేణుమాధవ్ పాత్రలా సీఎం తీరు.. వేముల సెటైర్లు

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలో బుధవారం జరిగిన సవాళ్ల తతంగంలో కాంగ్రెస్ మంత్రుల డొల్లతనం, వారి అసమర్థత ప్రజల ముందు బట్టబయలైందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు పోలీసులను అడ్డంపెట్టుకుని చర్చకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘నల్ల బాలు’ పాత్రలా సీఎం తీరు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం ‘సై’ సినిమాలో నటుడు వేణుమాధవ్ పోషించిన ‘నల్ల బాలు’ పాత్రలా మారిందని వేముల సెటైరికల్ కామెంట్స్ చేశారు. సినిమాలో ఆ పాత్ర ఎంత బిల్డప్ ఇచ్చినా చివరకు హీరో చేతిలో తన్నులు తిని తుస్సుమన్నట్లుగానే.. నిన్న కేటీఆర్, హరీశ్ రావు దెబ్బకు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ బిల్డప్ అంతా పటాపంచలైందని ఎద్దేవా చేశారు. చర్చలంటూ సవాళ్లు విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు తోక ముడిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న స్వయంగా సెల్ఫ్ గోల్ కొట్టుకుందని, “ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్” అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైందని విమర్శించారు.

తప్పించుకోవడం సీఎంకు కొత్తేమీ కాదు..

సవాళ్లు విసరడం, తీరా సమయం వచ్చాక తప్పించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ కు కొత్తేమీ కాదని ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు. హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లను చర్చకు రానీయకుండా వందలాది మంది పోలీసులను అడ్డుపెట్టి అక్రమంగా అరెస్ట్ చేయించడమే కాకుండా ఒక మాజీ మంత్రిని, అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఉపనేత అయిన హరీశ్ రావును డీసీఎం వ్యాన్‌లో పడేసి, నగరం అంతా తిప్పి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో బంధించడం అత్యంత దారుణమన్నారు. అరెస్టుల సమయంలో హరీశ్ రావు స్వయంగా ముగ్గురు కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తలేదని, పోలీసుల వెనుక దాక్కుని పలాయనం చిత్తగించారని మండిపడ్డారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది..

ప్రజాస్వామ్యంలో వాదనతో గెలవలేనప్పుడే అధికారపక్షం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని వేముల స్పష్టం చేశారు. నిన్నటి ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వ పరువు పూర్తిగా పోయిందని, ఆ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతలు నేడు ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సబ్జెక్ట్ లేనివారే ఇలాంటి డ్రామాలు ఆడుతారని, కాంగ్రెస్ మంత్రులకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేవని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకుల టెండర్లపై తమ మంత్రి కొండా సురేఖ లేఖను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాసినా, దానిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని వేముల ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. ఈ ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నేత గౌతు ప్రసాద్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>