Mobile Popup Ad
Mobile Popup Ad

లేడీ అడ్వకేట్ కేరాఫ్ సైబర్ నేరాలు

కలం, ఖమ్మం బ్యూరో: ఆమె ఓ లాయర్. మోసపోయామంటూ తన వద్దకు వచ్చినవారికి న్యాయం చేయాల్సిన స్థానంలో ఉంది. చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఆమెది. కానీ, కాసుల కక్కుర్తితో పక్కదారి పట్టింది. చట్టాలపై అవగాహనను అమాయకులను కొల్లగొట్టేందుకు వాడుకోవడం మొదలుపెట్టింది. సైబర్ మోసాలకు తెరలేపి రూ.కోట్లు దోచుకుంది. చివరికి ఖమ్మం (Khammam) పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. కేసు వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

రూ.15 లక్షలు దోచేశారు..

ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి కొద్ది రోజుల కిందట వాట్సాప్‌లో లింక్ ద్వారా కొందరు సైబర్ నేరగాళ్లు పరిచయమయ్యారు. ‘ఎనమ్ అసెట్ మేనేజ్‌మెంట్ పోర్ట్‌ఫోలియో లిమిటెడ్’ అనే పేరున్న కంపెనీలో ఆన్‌లైన్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ఊహించని రీతిలో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారు. నిజమేనని నమ్మిన సదరు ఉద్యోగి.. వారు పంపిన వివిధ వాట్సాప్ లింకులు, ట్రేడింగ్ అకౌంట్ల ద్వారా విడతల వారీగా సుమారు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత కేటుగాళ్లు స్పందించకపోవడంతో, తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

కేరళకు వెళ్లిన ప్రత్యేక బృందం..

​బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు డబ్బులు డిపాజిట్ చేసిన బ్యాంక్ ఖాతాలను నిశితంగా పరిశీలించగా.. కేరళలోని త్రివేండ్రం సిటీకి చెందిన ఆర్యదాస్ శైలజ (34) అనే మహిళా అడ్వకేట్‌కు చెందినదిగా తేలింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల ప్రత్యేక బృందం కేరళకు వెళ్లింది. త్రివేండ్రంలో నిందితురాలిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని, స్థానిక కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్‌పై ఖమ్మం కమిషనరేట్‌కు తరలించారు. అనంతరం స్థానిక సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

రూ.3 కోట్ల మేర అక్రమ లావాదేవీల గుర్తింపు..

​ఆర్యదాస్ శైలజ బ్యాంక్ ఖాతాను లోతుగా పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె ఖాతాలో ఖమ్మం బాధితుడి డబ్బుతో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన సుమారు 38 సైబర్ క్రైమ్ కేసులతో శైలజ అకౌంట్‌కు లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ అకౌంట్ ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ.3 కోట్ల మేర అక్రమ సైబర్ లావాదేవీలు జరిగినట్లు సీపీ సునీల్ దత్ స్పష్టం చేశారు. ​సుదూర ప్రాంతంలో ఉన్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్థురాలిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న సైబర్ క్రైమ్ టీమ్‌ను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

Read Also: కొత్త బంగారం పథకం వచ్చేస్తోంది!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>