కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati) అంశంపై కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి నిర్మాణం ముసుగులో రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు (Chandrababu) నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. రాజధాని పేరుతో జగన్మోహన్ రెడ్డి ఏనాడూ రాజకీయం చేయలేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే అమరావతి అవినీతిపై ప్రశ్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రాధాన్యత ఎప్పుడూ దోచుకోవడమేనని.. దాన్ని ప్రశ్నిస్తే తమ మీద మండిపడుతున్నాడని అన్నారు. అవినీతి, స్కామ్‌లకు చంద్రబాబు బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో అభివృద్ధి పనులు చేయొచ్చు..
అమరావతిలో రైల్వేస్టేషన్ అని, ఎయిర్ పోర్ట్ అని రోజుకో పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి అవకాశాలు పెంచుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటి వరకూ రూ.45 వేల కోట్లు అప్పుతెచ్చి రూ.50 వేల కోట్లకు పైగా పనులకు కాంట్రాక్టులు ఇచ్చేశాడని అన్నారు. ఆ నిధులతో మచిలీపట్నం పోర్టు పూర్తి అవుతుందని చెప్పుకొచ్చారు. మెడికల్ కాలేజీలు, రాయలసీమ లిఫ్టు, హంద్రీ నీవా కాలువ వెడల్పు, వెలిగొండ ఆర్ అండ్ ఆర్ ఇచ్చి నీళ్లు విడుదల చేయొచ్చని అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యతోపాటు ఆరోగ్యశ్రీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు తీర్చవచ్చని చెప్పారు.
ఆ ఉద్దేశం చంద్రబాబుకు లేదు..
అమరావతి నేల రాజధానికి పనికిరాదని గతంలో చాలా మంది చెప్పారని సజ్జల (Sajjala) హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని పూర్తి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదన్నారు. అందుకే తమ నేత జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు ఎక్కడైనా సమాధానం ఇస్తున్నారా? అని అడిగారు. అమరావతి రైతులతో కూటమి ప్రభుత్వం సినిమాలో విలన్లు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. భూములు ఇవ్వబోమన్న రైతుల పొలాల చుట్టూ మట్టి తవ్వేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అమరావతి గురించి ఎవరు మాట్లాడినా ఊరుకోమంటూ తమ మీద దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు..
మావిగన్ అనగానే చంద్రబాబు (Chandrababu) ఉలిక్కిపడుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. అమరావతికి, మావిగన్‌కు మధ్య తేడా ఏంటో జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. మావిగన్‌లో తక్షణ అభివృద్ధికి అవకాశం ఉందన్న ఆయన.. అమరావతి అప్పుల భారాన్ని రాష్ట్రం మోయలేదని అభిప్రాయపడ్డారు. రైతులు ఇచ్చిన భూముల్లో లే అవుట్లు కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదన్నారు. ఏదేమైనా చంద్రబాబు అమరావతి అక్రమాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు.
Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!
Follow Us On : WhatsApp

