Mobile Popup Ad
Mobile Popup Ad

బీసీలను అవమానిస్తే గుణపాఠం తప్పదు.. కాంగ్రెస్‌పై శ్రీనివాస్ సాగర్ ఫైర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరిస్తూ అవమానకరంగా చూస్తూ ముందుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ (BC Samaj Leader Srinivas Sagar) శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ మధ్య యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యుల నియామకంలో, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీసీ బిడ్డ సంజీవ్ ముదిరాజ్ విషయాల్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వకుండా అవమానపరచడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

బీసీ బిడ్డ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు సైతం సమాచారం ఇవ్వకుండా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యుల నియామకంలో ఇష్టమైన వారిని నియమిస్తూ మంత్రిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒంటెద్దు పోకడలతో అగ్రవర్ణ నాయకులు బీసీలను విస్మరిస్తూ వాళ్లకనుగుణమైన వ్యక్తులను అందలమెక్కిస్తున్నారని విమర్శించారు.

ఆధ్యాత్మిక సేవలు చేసేవారికి ఇవ్వాలి..

ఆధ్యాత్మిక సేవలు చేసేవారిని ట్రస్టు బోర్డుల్లో చైర్మన్ గా, సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యాపార రంగంలో ఉన్న వారికి సముచిత స్థానం కల్పించడం ఏ విధంగా అర్థం చేసుకోవాలో సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే పద్దతి కనుక మునుముందు పునరావృతమైతే భవిష్యత్తులో బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు.

మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ సంజీవ్ ముదిరాజ్ కు కూడా జిల్లాలో చాలా సందర్భాల్లో వివిధ పార్టీ కార్యక్రమాల్లో తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాలలో సైతం పిలవకుండా, ఇతర పార్టీల నుంచి జాయినింగ్ కార్యక్రమంలో కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా, కనీసం సమాచారం లేకుండా ఏక పక్షంగా ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో బీసీల నుంచి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

అగ్రవర్ణ నాయకులు జీర్ణించుకోవట్లేదు..

చాలా ఏళ్ల తర్వాత మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షునిగా ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డకు అవకాశం వస్తే.. దాన్ని కూడా అగ్రవర్ణ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని నిర్లక్ష్యం, అగౌరవంతో ప్రవర్తిస్తున్న తీరును బీసీలు గమనిస్తున్నారని శ్రీనివాస్ సాగర్ మండిపడ్డారు.

బీసీల నాయకత్వాన్ని మీరు స్వీకరించనప్పుడు మీ నాయకత్వాన్ని కూడా స్వీకరించే పరిస్థితిలో బీసీ సమాజం లేదని విమర్శించారు. ‘ఓట్లు మావి.. సీట్లు కూడా ఇకనుంచి మావే’ అనే నినాదంతో ముందు కెళ్ళి భవిష్యత్తులో జరుగనున్న ఏ ఎన్నికల్లో అయినా బీసీలే మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా పోరాడి తాము అధికారాన్ని చేజెక్కించుకుంటామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>